విహార యాత్రకో, లేదా ఏదో పని మీదనో మనకు తెలియని ప్రదేశానికి వెళ్తే.. ముందుగా ఎవరైనా చేసే పని అక్కడ ఉన్న హోటల్లో ఓ రూమ్ అద్దెకు తీసుకోవడం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆధారంగా మన మొబైల్లోనే రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే, దానికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ బంగాల్లోని ఓ మినీ హోటల్లో మాత్రం.. కేవలం రూ.20 చెల్లించి ఓ గదిని అద్దెకు తీసుకోవచ్చు. దీంతో పాటుగా అక్కడ అతి తక్కువ ధరకే భోజనం కూడా లభిస్తుంది. ఇవన్నీ వింటుంటే.. ఏదో దిగ్గజ హోటల్ యాజమాన్యం పండుగ డిస్కెంట్లో భాగంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే! ఎందుకంటే ఈ హోటల్ నడుపుతున్నది ఓ రిక్షావాలా.
శిలిగుడి ప్రాంతానికి చెందిన మహేంద్ర సర్కార్ అనే రిక్షావాలా కేవలం రూ.20కే అద్దె గదులను అందిస్తున్నాడు. శిలిగుడి అనేది ఓ పట్టణ ప్రాంతం. దీంతో అక్కడ పని చేయడం కోసం రోజువారీ కూలీలు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే ఇలా వచ్చిన వారు కొన్నిసార్లు రెండు, మూడు రోజులు అక్కడే ఉండి పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో వారు తమకొచ్చే రోజువారీ కూలీతో సాధారణ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకుని ఉండలేరు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని మాహేంద్ర సర్కార్.. 24 గంటల పాటు బస చేయడానికి కేవలం రూ.20 వసులు చేస్తూ వారికి వసతి కల్పిస్తున్నాడు. దీంతో పాటుగా శాకాహార భోజనం రూ.30, చేపలు రూ.50, చికెన్ మీల్స్ అయితే రూ. 60కే అందిస్తున్నాడు. దీనికోసం మాహేంద్రనే ప్రత్యేకంగా ఓ హోటల్‌ను కూడా నడుపుతున్నాడు.
ఆరేళ్ల క్రితం రూ.10గా ఉన్న తన హోటల్ అద్దెను.. ఇటీవలే మాహేంద్ర రూ.20కు పెంచాడు. అయితే ఎంతో మంది రోజువారీ కూలీలు, మేస్త్రీలు, ఆటో, రిక్షా డ్రైవర్లు మహేంద్ర నడుపుతున్న హోటల్‌కు వచ్చి ఉంటుంటారు. ప్రస్తుతం రిక్షా నడుపుతున్న మాహేంద్ర.. 40 ఏళ్ల పాటు కూలీగా పనిచేశాడు. ఆ సమయంలో పని కోసం అని పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే అక్కడ తక్కువ ధరలో అద్దె గదులు లభించక తీవ్ర ఇబ్బందులు పడేవాడు. ఆ సమయంలోనే రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండేలా.. అతి తక్కువ రేటులో హోటల్ గదులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
మహేంద్ర అనుకున్నదే తడవుగా.. ఇనుప రేకుల సహాయంతో తన ఇంటినే రెండంతస్తుల భవనంగా మార్చాడు. పైకి ఎక్కడానికి వీలుగా చెక్కతో మెట్లు ఏర్పాటు చేశాడు. రూ.20కే లభించే ఈ గదుల్లో.. ఓ బెడ్, లైట్, ఫ్యాన్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశాడు మహేంద్ర. ఇవే కాకుండా తినడానికి ప్రత్యేక స్థలం, బాత్రూమ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. మహేంద్ర నడుపుతున్న ఈ మినీ హోటల్లో ప్రస్తుతం రోజుకు 15 మందికి వసతి కల్పించడానికి వీలుగా ఉంది. నిత్యం రద్దీ లేకపోయినా సరే.. పండుగ రోజుల్లో మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుందని మహేంద్ర తెలిపాడు.