మరణంలోనూ విడదీయలేని స్నేహం వారిది. ఒకరు హిందూ, మరొకరు ముస్లిం. అయితేనేం మతం వారి స్నేహానికి అడ్డురాలేదు. తమిళనాడు అరియలూర్ తాలూకా జయకొండంలో నివసించే మహాలింగం(70), జైలబుద్దీన్(66) మతాలు వేరైనా ప్రాణ స్నేహితులుగా మెలిగేవారు. అయితే అనుకోని విధంగా వారిద్దరూ అర గంట వ్యవధిలోనే మరణించడం ఇరు కుటుంబాల్లోనూ విషాదం నింపింది.
ఎదురెదురు ఇళ్లలో నివాసం..
స్థానిక విరుధాచలం రోడ్డులోని మారియమ్మన్ ఆలయంలో మహాలింగం పూజారి. ఆలయానికి సమీపంలోనే టీ స్టాల్ కూడా నడిపేవాడు. జైలబుద్దీన్ రైస్ మిల్లు యజమాని. మహాలింగం ఇంటికి ఎదురుగా నివసిస్తున్నాడు.
మహాలింగం ఇంట్లో జరిగే శుభకార్యాలు, పండుగలకు జైలబుద్దీన్ కుటుంబంతో సహా హాజరయ్యేవాడు. అలానే జైలబుద్దీన్ ఇంట్లో నిర్వహించే ముస్లిం పండుగలకు మహాలింగం తప్పక వెళ్లేవాడు.
ఆకస్మిక మరణంతో..
రక్తపోటుతో బాధపడుతోన్న మహాలింగం మంగళవారం ఆసుపత్రిలో చేరాడు. అయితే అంతకుముందే అనారోగ్యం కారణంగా అదే ఆసుపత్రిలో జైలబుద్దీన్ చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరినీ ఒకే వార్డులో ఉంచారు వైద్యులు. ఏప్రిల్ 6 సాయంత్రం 4 గంటల సమయంలో జైలబుద్దీన్ ఛాతీ నొప్పితో కన్నుమూశాడు. స్నేహితుని మరణ వార్త విన్న మహాలింగం తీవ్రంగా బాధపడి, కన్నీళ్లు పెట్టుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 30 నిమిషాలకే ఆయన కూడా ప్రాణాలు విడిచాడని చెప్పారు.
40 ఏళ్ల వీరి స్నేహానికి గుర్తుగా ఇరు కుటుంబాలు ఉమ్మడి బ్యానర్‌ను ఏర్పాటు చేశాయి.
ఇవీ చదవండి: గదిలో విగతజీవులుగా తల్లిదండ్రులు.. బాల్కనీలో చిన్నారి!