ప్రతిష్ఠాత్మకమైన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పుడున్న పార్లమెంట్ భవనాల్లోని చాలావాటిని పునరుద్ధరించి నేషనల్ మ్యూజియంలా వినియోగించుకోనున్నట్లు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారసత్వ భవనాలైన నార్త్, సౌత్ బ్లాక్‌లను మ్యూజియంగా మార్చబోతున్నట్లు తెలిపింది. జన్‌పథ్ హోటల్ భవనంలో ప్రస్తుతం ఉన్న నేషనల్ మ్యూజియం (ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్)ను పునరుద్ధరించిన భవనాల్లోకి బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. కృషి భవన్, నిర్మాణ్ భవన్ల భవితవ్యం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు..
కేంద్ర సెక్రటేరియేట్ నిర్మాణంలో భాగంగా 3 కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తూ..గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ తాజాగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో సీట్ల సామర్థ్యాన్ని పెంచుతూ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్ణించనున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతికి నూతన భవనాలను నిర్మించనున్నారు. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌తో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు 2024లో పూర్తికానుంది. రాజ్యసభలో 384 సీట్లు, లోక్‌సభలో 888 సీట్లు, ఉభయ సభల సమావేశాలకు 1272 సీట్ల సామర్థ్యంతో భవనాల నిర్మాణం జరగనుందని రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ బుధవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎన్ని భవనాలను కూల్చనున్నారు? ఎన్ని భవనాలను పునరుద్ధరించనున్నారో ఇంకా పూర్తిగా నిర్ణయించలేదని తెలిపారు.
రాష్ట్రాలకు ఆదర్శం..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనుందని అర్బన్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్టినేటర్ డా.కేకే పాండ్యా చెప్పారు. వారసత్వ కట్టడాలు కలిగిన కర్ణాటక, బంగాల్, ఉత్తరప్రదేశ్‌లు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువనున్నాయని తెలిపారు.
"ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వారసత్వ కట్టడాలను కూల్చే ప్రసక్తే లేదు. వాటిని పునరుద్ధరించనున్నాం. వారసత్వ పరిరక్షణ కమిటీ ఈ బాధ్యతలు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వివిధ ప్రదేశాల్లో ఉంటే..శాఖల మధ్య సమన్వయం కష్టంగా మారింది.చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఈ ప్రాజెక్టుతో పరిష్కారం దొరకనుంది. రూ.971 కోట్ల బడ్జెట్‌తో 2022 నాటికి కొత్త పార్లమెంట్ భవనం పూర్తికానుంది"
-డా.కేకే పాండ్యా, అర్బన్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్టినేటర్
ఇదీ చదవండి: 'మోదీ.. భగవంతుని అవతారం'