కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత తాండవం చేస్తోందని, టీకా ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ రాహుల్ గాంధీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.
"దేశ ప్రజల కోసం వ్యాక్సిన్లు ఎక్కడున్నాయని రాహుల్ అడుగుతున్నారు. ఎక్కడున్నాయో ఆయనకు తెలియదా? రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లోని చెత్తకుండీల్లో ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి" అంటూ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్‌లో వ్యాక్సిన్ల విషయంలో ఏం జరుగుతోందో ముందు తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.
ఎక్కువ ధరలకు..
కేంద్రం నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను పంజాబ్ ప్రభుత్వం ఎక్కువ ధరలకు ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయిస్తోందంటూ ప్రతిపక్ష అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కేంద్రం నుంచి ఒక్కో వ్యాక్సిన్‌ను రూ.400 కొనుగోలు చేసి, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1,060కి విక్రయిస్తున్నారని, అక్కడ మరికొంత లాభంతో ప్రజలకు రూ.1,560కి టీకా వేస్తున్నాయని బాదల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా సరైన వివరణ ఇవ్వలేక, మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ తీరుతెన్నుల గురించి కేంద్రం ఆరాతీయడం, గంటల వ్యవధిలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఈ పరిణామాలు విపక్షాల విమర్శలకు మరింత పదును పెంచాయి. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 11.4 లక్షల డోసులను వృథా చేసిందంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోపించారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేస్తోంది. కేవలం రెండుశాతం డోసులే వృథా అయినట్లు చెబుతోంది. దీనిపై ఇంకా నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : భాజపా నేత సువేందు అధికారిపై కేసు నమోదు