Hafiz Saeed Extradition : ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే-తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌ను కోరినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. భారత్‌లో జరిగిన ఎన్నో ఘటనల్లో అతని ప్రమేయం ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం తెలిపారు. హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ముంబయి పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని సంబంధిత పత్రాలతో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
హఫీజ్ సయీద్ కుమారుడు ఎన్నికల్లో పోటీ చేయనుండటంపైనా అరిందమ్ బాగ్చి ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజకీయ విధానంలో భాగంగా కరుడుగట్టిన ఉగ్ర సంస్థలను జనజీవన స్రవంతిలో చూపించే ప్రయత్నం పాక్ చేస్తోందని అన్నారు. ప్రాంతీయ భద్రతకు ఇది ఏమాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుందని తెలిపారు.
26/11 దాడుల సూత్రధారి
2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ దారుణంతోపాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడు స్థాపించిన లష్కరే తొయిబాను ఐరాసతో పాటు భారత్, అమెరికా, యూకే, ఈయూ, ఆస్ట్రేలియా, రష్యా ఉగ్రసంస్థగా గుర్తించాయి. హఫీజ్ తలపై 10 అమెరికా మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి.
జైల్లో హఫీజ్- రాజకీయాల్లోకి తనయుడు
ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న కేసులు సహా పలు కేసుల్లో హఫీజ్ సయీద్ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం పాక్ జైల్లో ఉన్న హఫీజ్ అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. సయీద్ ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ వచ్చే ఏడాది జరగబోయే పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇదే పార్టీ తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.
దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం!- కరాచీ ఆస్పత్రిలో చికిత్స- ఇంటర్నెట్ బంద్!