దేశ రాజధాని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)పై హ్యాకర్లు పంజా విసిరారు. ఎయిమ్స్ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు కోరుతున్నారని తెలిసింది. గత ఆరు రోజులుగా ఇక్కడి సర్వర్లు నిలిచిపోవడంతో ఆస్పత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్‌గానే జరుగుతోంది.
ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు తొలుత బుధవారం గుర్తించారు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల సమాచారం వీటిల్లో నిక్షిప్తమై ఉంది. ఇందులో పలువురు వీఐపీలు, మాజీ ప్రధానులు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులకు సంబంధించి ఆరోగ్య సమాచారం ఉండడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వర్లు నిలిచిపోవడం వల్ల ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, లేబోరేటరీ వంటి సేవలు మాన్యువల్‌గానే నిర్వహిస్తున్నారు.
మరోవైపు హ్యాకర్ల దాడిపై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ , దిల్లీ పోలీసులు, హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు దర్యాప్తు జరుపుతున్నారు. దోపిడీ, సైబర్ ఉగ్రవాదం అభియోగాల కింద దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సంస్థల ఆదేశంతో ఆస్పత్రిలోని కంప్యూటర్లన్నింటికీ ఇంటర్నెట్ సేవలు తొలగించారు. ఇ-హాస్పిటల్ డేటా బేస్‌ను పునరుద్ధరించారు. మరోవైపు ఎయిమ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా యాంటీ వైరస్ ద్వారా స్కాన్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఐదు రోజుల పాటు కొనసాగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.