Gyanvapi Mosque Survey: కాశీలోని ప్రఖ్యాత విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదుకు వెలుపల ఉన్న శృంగార్ గౌరి, గణేశ్, హనుమాన్, నంది దేవతా ప్రతిమలకు నిత్య పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీకి చెందిన మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజలు అనుమతి ఇస్తున్నారు. ప్రతిరోజూ పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించడం సహా ఆ దేవతా ప్రతిమలను పరిరక్షించేలా చూడాలని వారు కోర్టును కోరారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ప్రతిమలకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఉత్తర్వులిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వే కోసం వెళ్లిన కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ నేతృత్వంలోని బృందాన్ని ముస్లింలు అడ్డుకున్నారు. అజయ్‌కుమార్ మిశ్ర, హిందు, ముస్లింల తరఫు న్యాయవాదులు కలిసి జ్ఞానవాపి-శృంగార్ గౌరి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లినప్పటికీ వారు సర్వేను, వీడియో చిత్రీకరణను చేపట్టలేకపోయారు.
అయితే అజయ్ కుమార్ మిశ్ర స్థానంలో మరో వ్యక్తిని సర్వే కోసం నియమించాలని కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించిన హిందువుల తరఫు న్యాయవాది తాము లోపలికి వెళ్లకుండా మసీదులో ఉన్న ముస్లింలు అడ్డుకున్నారని అందువల్ల కోర్టు ఆదేశించిన విధంగా సర్వే, వీడియో చిత్రీకరణ పూర్తి చేయలేకపోయామని కోర్టుకు తెలిపారు. జిల్లా అధికారులు కూడా తమకు సహకరించలేదని ఆరోపించారు. సర్వే నిర్వహణకు సంబంధించి కచ్చితమైన ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఇరుపక్షాల వాదనలు ఆలకించిన న్యాయమూర్తి.. ఈనెల 9న తీర్పును రిజర్వు చేశారు.
తాజాగా ఉత్తర్వులిచ్చిన కోర్టు..సర్వే కొనసాగించాలని స్పష్టంచేసింది. కోర్టు కమిషనర్ అజయ్‌కుమార్ మిశ్రను.. మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. సర్వే కోసం మరో ఇద్దరు అడ్వకేట్ కమిషనర్లను ఆయనకు సాయంగా నియమించింది. ఈనెల 17లోగా సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్