గుజరాత్లో స్థానిక సంస్థల తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొదటి నాలుగు గంటల్లో 7.1 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఆరు (అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్) నగర కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. కరోనా నిబంధనల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తొలిదశ పోలింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన కుటుంబసభ్యులతో కలిసి అహ్మదాబాద్‌లోని నారన్‌పుర వార్డులో ఓటు వేశారు.
రాజ్‌కోట్‌లో సీఎం రూపానీ.!
ఇటీవల కరోనా బారినపడిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. తన స్వస్థలమైన రాజ్‌కోట్‌లో ఓటు వేయనున్నారు
ఇప్పటివరకు.. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఓటు వేశారు. వారిలో భాజాపా ఎంపీ కిరిత్ సోలంకి.. రాణిప్ ప్రాంతంలో ఓటు వేయగా.. ఎమ్మెల్యే రాకేశ్ షా ఎల్లిస్బ్రిడ్జ్ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏ పార్టీ? ఎన్ని స్థానాల్లో?
రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక ఎన్నికలు కీలకం కానున్నాయి. భాజపా, కాంగ్రెస్‌లు ప్రధాన పోటీదారులుగా నిలవగా.. వాటికి తమ పార్టీయే ప్రత్యామ్నాయంగా భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్). మొత్తం 575 స్థానాలకు 2276 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భాజపా నుంచి 577, కాంగ్రెస్ 566, ఆమ్ఆద్మీ పార్టీ 470, ఎన్సీపీ 91, ఇతరులు 353, స్వతంత్రులు 228 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎఐఐఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్) కూడా 21 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
6 నగరాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 11,121 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయగా వాటిల్లో 2255 సున్నితమైనవని, 1188 అత్యంత సున్నితమైనవిగా పేర్కొన్నారు. మొత్తం 32,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
రెండో దశలో 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: అమ్మ భాషే జీవితానికి ఆత్మ: వెంకయ్య నాయుడు