ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌పై తన పట్టును భాజపా మరోసారి నిరూపించుకుంది. నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 104 స్థానాలకు గాను ఏకంగా 95 చోట్ల విజయ దుందుభి మోగించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే భాజపా అడ్డాలో ఒక నగరపాలక సంస్థను కాంగ్రెస్ దక్కించుకుంది.
గాంధీనగర్, ద్వారకా జిల్లాలోని ఓఖా, భాణ్వఢ్.. బనాస్కాంఠా జిల్లాలోని థారా నగరపాలక సంస్థకు ఈ నెల 3న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న కమలదళం.. గాంధీనగర్‌లో 44 స్థానాలకు గాను 41 స్థానాలు దక్కించుకోగా.. ఓఖాలో 36 స్థానాలకు 34 స్థానాలు, థారాలో 24 స్థానాలకు 20 చోట్ల విజయ దుందుభి మోగించింది.
భాజపాకు కాంగ్రెస్ షాక్
అయితే 1995(దాదాపు 26 ఏళ్లుగా) నుంచి అధికారంలో కొనసాగుతున్న ద్వారకా జిల్లాలోని భాణ్వఢ్లో ఈ సారి భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 24 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 16 స్థానాల్లో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసి అధికారం చేజిక్కించుకుంది. ఈసారి భాజపా 8 స్థానాలకే పరిమితమైంది. అయితే మిగిలిన మూడు చోట్ల గాంధీనగర్‌లో(2), థారాలో (4), ఓఖాలో (2) స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది కాంగ్రెస్.
ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ఆద్మీ పార్టీ గాంధీనగర్‌లో ఒకే ఒక స్థానంలో గెలిచి.. మిగిలిన చోట్ల ఒట్టిచేతులతో వెనుదిరిగింది.
ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్‌లో 56.24 శాతం ఓట్లు పోలవగా.. ఓఖాలో 55.07శాతం, భాణ్వఢ్లో 62.27శాతం, థారాలో రికార్డు స్థాయిలో 73.55 శాతం ఓటింగ్ జరిగింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల దృష్ట్యా అనూహ్యంగా సీఎంను, మంత్రులను మార్చింది భాజపా. ఆ తర్వాత జరిగిన తొలి స్థానిక ఎన్నికల్లో భాజపాకు తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన సత్తా చాటి.. రాష్ట్రంపై మరింత పట్టు సాధించింది. ఫిబ్రవరిలో జరిగిన నగరపాలక ఎన్నికల్లోనూ భాజపా ఘన విజయం నమోదు చేసింది.
ఇదీ చూడండి: ప్రియాంకా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు..