పురాతనమైన 'ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు' (ఓఎఫ్‌బీ)ని పునర్వ్యవస్థీకరించడానికి కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. చాలాకాలం నుంచి ఉన్న ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ఆయుధాలు, సైనిక సంబంధ పరికరాల ఉత్పత్తి కోసం ఉన్న 41 కేంద్రాలను ప్రభుత్వ ఆధీనంలో ఏడు కార్పొరేట్ సంస్థలుగా విభజించడానికి సమ్మతించింది. జవాబుదారీతనం, సమర్థత, పోటీతత్వాలను మెరుగుపరచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఓఎఫ్‌బీలో ఉన్న దాదాపు 70,000 మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు.
నౌకాయాన స్వేచ్ఛ అవసరం
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నియమాల ఆధారిత వ్యవస్థ ఉండాలని, నౌకాయాన స్వేచ్ఛ అవసరమనీ రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రం సహా అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్యానికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదని చెప్పారు. దూకుడు కనపరుస్తున్న చైనా పేరెత్తకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఉగ్రవాద బెడద నిర్మూలనకు ఉమ్మడిగా ప్రయత్నాలు జరగాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ