మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మధ్యప్రదేశ్లోని కదమ్ అనే స్వచ్ఛంద సంస్థ వినూత్నంగా ఆలోచించింది. బంగారంతో ట్రీ గార్డును ఏర్పాటు చేసింది. ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించి అర కిలో పసిడితో(దాదాపు రూ.30 లక్షలు) జబల్పుర్ రైల్వే స్టేషన్ బయట.. ఈ ట్రీగార్డును నెలకొల్పింది . అయితే.. ఈ ట్రీగార్డుకు ఉండే రెండు రింగులు హఠాత్తుగా అదృశ్యమయ్యాయి.
బంగారం కంటే చెట్లే విలువైనవని ప్రజలు గ్రహించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు కదమ్ సంస్థ సభ్యుడు యోగేశ్ గనోరె తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఈ రింగుల్లో ఒకటి కనిపించకపోవడాన్ని గమనించి రైల్వే అధికారులకు లిఖిత పూర్వక సమాచారం అందించినట్లు చెప్పారు. కానీ, దీనిపై అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు.
"జబల్పుర్ గర్వానికి ప్రతీక ఈ ట్రీగార్డు. కదమ్ సంస్థ ఎంతో ఖర్చు చేసి దీనిని ఏర్పాటు చేసింది. ఈ ట్రీ గార్డును సంరక్షించాల్సిన బాధ్యత రైల్వే అదికారులది. కానీ, వాళ్లు దాన్ని కాపాడలేకపోయారు. ఇప్పుడు ఈ విషయమై వారు ఏమీ చెప్పడం లేదు."
--యోగేశ్ గనోరే, కదమ్ సంస్థ సభ్యుడు
ప్రపంచంలోనే ఈ తరహా బంగారు ట్రీ గార్డు.. జబల్పుర్ మినహా మరెక్కడా లేదని కదమ్ సంస్థ చెబుతోంది. వీటిని సంరక్షణలో రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది.
ఇదీ చదవండి:పేద ప్రజల కోసం ఒక్క రూపాయికే వైద్యం