Girl Advertisement for Groom: పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తుంటారు. అబ్బాయిని చూడమని బంధువులు, సన్నిహితులకు చెబుతుంటారు. అయితే ఝార్ఖండ్ హజారీబాగ్‌కు చెందిన ఓ యువతి మాత్రం తన సంబంధం తానే చూసుకుంటోంది. వరుడు కావాలని పత్రికా ప్రకటన ఇచ్చింది. ఓ పెళ్లి వేడుకలో గోడపై దీన్ని అతికించింది. తనకు ఎలాంటి వాడు కావాలో పూస గుచ్చినట్లు ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్నవారు సంప్రదించేందుకు రెండు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది.
ఈ యువతి హజారీబాగ్ ఝండా చౌక్ సమీపంలోని బంగాలీ దుర్గాలో నివాసముంటోంది. పత్రికా ప్రకటనలో చెప్పిన వివరాలు ప్రకారం ఆమెకు ఎలాంటి వాడు కావాలంటే..
అబ్బాయి మంచి వాడు అయి ఉండాలంట. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలంట. వయసు 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. నిజాయితీగా ఉండాలి. అబద్దాలు చెప్పకూడదు. పిసినారితనం ఉండకూడదు. ఏ కులానికి చెందినవాడైనా అభ్యంతరం లేదు. మరీ హైపర్ యాక్టివ్‌గా ఉండనక్కర్లేదు. కాస్త యాక్టివ్‌గా ఉంటే చాలు. తనకంటే చిన్నవాడైనా సరే ఆసక్తి ఉంటే ఓకే. ఈ నిబంధనలు వర్తించేవారు సంప్రదించేందుకు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది యువతి. ఈ ప్రకటన చూసిన వాళ్లంతా ఔరా అనుకుంటున్నారు. పెళ్లి కావాలని ఓ యువతి ప్రకటన ఇవ్వడమేంటమని ఆశ్చర్యపోతున్నారు. ఈ గోడ పత్రికను ఫొటోను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. స్థానికంగా ఈ విషయమే చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: భార్య కోసం.. జైలులో 50 రోజులుగా నిరాహార దీక్ష