Girl Dead Body Covered With Cow Dung : ప్రస్తుత నాగరిక సమాజంలోనూ మూఢ నమ్మకాలు తగ్గట్లేదు. చనిపోయిన మనుషులను మాంత్రికులు బతికిస్తారని నమ్మేవాళ్లు ఇప్పుడూ ఉన్నారు. అచ్చం అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాపుర్ జిల్లాలో జరిగింది. పాముకాటుకు గురై మరణించిన ఓ బాలిక బతుకుతుందనే ఆశతో.. భూతవైద్యుడి సూచన మేరకు ఆవుపేడ పూసి పూజలు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అలాగే మృతదేహం చుట్టూ వేప కొమ్మలను ఉంచారు. అప్పుడు ఏం జరిగిందంటే?
నిద్రిస్తుండగా పాముకాటు..
థానాకాంత్ ప్రాంతంలోని రావత్‌పుర్ గ్రామానికి చెందిన మంగళ్ సింగ్.. తన కుటుంబంతో కలిసి గుడిసెలో ఆదివారం రాత్రి నిద్రపోతున్నాడు. ఈ క్రమంలో మంగళ్ సింగ్ ఆరేళ్ల కుమార్తెను ఓ పాటు కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆస్పత్రికి తరలించలేదు. భూతవైద్యం ద్వారా బాలికను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమించడం వల్ల ఆస్పత్రికి తరలించారు. బాలిక చనిపోయినట్లు షాజహాపుర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. భూతవైద్యుడు పరీక్షించాడు. బాలిక బతికే ఉందని.. ఆవు పేడను ఆమె శరీరంపై పూయమని.. అలాగే మృతదేహం చుట్టూ వేప కొమ్మలను ఉంచమని చెప్పాడు. అప్పుడు బాలిక కుటుంబ సభ్యులు ఆమె బతుకుతుందని ఆశపడ్డారు. భూతవైద్యుడు చెప్పినట్లు పూజలు చేశారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు..
మృతదేహంపై ఆవుపేడ పూశారనే సమాచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు రావత్పుర్కు భారీగా తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. బాలిక మరణించిందని ఆమె కుటుంబ సభ్యులకు వివరించారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. అప్పుడు బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
'పాము కాటు తర్వాత గంట గోల్డెన్ పీరియడ్'
పాము కాటు తర్వాత ఒక గంట గోల్డెన్ పీరియడ్ అని షాజహాపుర్ మెడికల్ కాలేజీ అత్యవసర విభాగానికి చెందిన డాక్టర్ రాహుల్ యాదవ్ చెప్పారు. ఒక గంటలోపు రోగిని ఆస్పత్రిలో చేర్చినట్లయితే.. కాపాడవచ్చని ఆయన తెలిపారు. పాము కాటు తర్వాత రోగిని భూతవైద్యుడి దగ్గరికి కాకుండా ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. రోజుకు 3 నుంచి 4 పాము కాటు కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని రాహుల్ యాదవ్ చెప్పారు.
మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం.. కొన్ని గంటల తర్వాత
ఐసీయూలో రోగికి 'భూతవైద్యుడి' ట్రీట్మెంట్.. డాక్టర్లంతా అక్కడే ఉన్నా..