Friends Killed Friend In Bihar : అప్పు ఇచ్చిన రూ.500ను తిరిగా అడిగాడని ఓ వ్యక్తిని అతడి నలుగురు స్నేహితులు దారుణంగా హతమార్చారు. యువకుడి ఒక కంటిని పీకేసి కత్తితో గొంతు కోసి చంపారు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి పరారయ్యారు. ఈ అమానుష ఘటన బిహార్లోని ఆరా జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని బసంత్‌పుర్ గ్రామానికి చెందిన మోహన్ సింగ్(20) రోజువారీ కూలీ. అతడి స్నేహితులు బుధవారం సాయంత్రం పార్టీ చేసుకుందామని మోహన్సింగ్ను పిలిచారు. పార్టీకి వెళ్లిన మోహన్ సింగ్ అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో గాబరా పడ్డ కుటుంబీకులు అతడి కోసం వెతికారు. మృతుడి స్నేహితుల దగ్గరకి వెళ్లి అడిగినా వారు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామంలోని ఓ చెరువులో మోహన్ సింగ్ మృతదేహం గ్రామస్థులకు కనిపించింది. ఒక కన్ను పీకేసి గొంతుపై తీవ్ర గాయాలతో ఆ మృతదేహం ఉంది. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే మోహన్ సింగ్ కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముసాఫిల్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆరా ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్మార్టం పరీక్షల కోసం తరలించారు. తమ గ్రామానికి చెందినవారే మోహన్ సింగ్ను హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన సోదరుడికి అజయ్ మహతో అనే వ్యక్తి రూ.500 ఇవ్వాలని మృతుడి అన్న మనోజ్ సింగ్ తెలిపాడు. ఆ విషయంలో గొడవ జరిగి తన తమ్ముడ్ని దారుణంగా హత్య చేశారని ఆరోపించాడు. పార్టీ చేసుకుందామని తన సోదరుడిని పిలిచి చంపేశారని బోరున విలపించాడు.
"బసంత్‌పుర్ గ్రామ సమీపంలో ఒక యువకుడు హత్యకు గురైనట్లు మాకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి కంటిని పీకేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించారు. స్నేహితులకి అప్పుగా ఇచ్చిన రూ.500 ఇవ్వమని అడగడం వల్లే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారితో నిజాలను చెప్పిస్తాం" అని పోలీసులు తెలిపారు.