Identity theft for 41 years: బిహార్లోని నలంద జిల్లాలో ఓ ఆసక్తికరమైన కేసుపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 40 ఏళ్లుగా ఓ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధించింది.
కథేంటంటే?: బెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్గవాన్ గ్రామానికి చెందిన భూస్వామి కామేశ్వర్ సింగ్కు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అతడి పేరు కన్నయ్య సింగ్. 1977లో కన్నయ్య సింగ్ ఆచూకీ కోల్పోయాడు. చండీ హైస్కూల్లో చదివే కన్నయ్య.. పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు.
Athadu cinema kind of fraud: కొన్నేళ్ల తర్వాత 'భర్తరి' అనే సాధువు గ్రామానికి వచ్చాడు. అతడిని కన్నయ్య అని భావించిన గ్రామస్థులు.. కామేశ్వర్ ఇంటికి తీసుకెళ్లారు. అయితే, కామేశ్వర్ సింగ్ కుమార్తే రామసఖి దేవికి అనుమానం వచ్చింది. అతడు తన సోదరుడు కాదని వాదించింది. 1981లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ ఆస్తి కొట్టేసేందుకే అతడు తమ ఇంటికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, దర్యాప్తులో నిజం బయటపడింది. ఇంటికి వచ్చిన వ్యక్తి కన్నయ్య సింగ్ కాదని తేలింది. అతడి అసలు పేరు దయానంద్ గోసాయి అని, లకాయి గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు.
ఈ కేసు గత 40 ఏళ్లుగా విచారణ దశలోనే ఉండటం గమనార్హం. కన్నయ్యకు ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. సుదీర్ఘ విచారణపై విసుగెత్తి ఐదుగురు ఈ కేసును అంతగా పట్టించుకోలేదు. అయితే, రామసఖి దేవి మాత్రం ఇంటికి వచ్చిన వ్యక్తిని తన సోదరుడిగా ఒప్పుకోకుండా కోర్టులో పోరాడుతూనే ఉంది. ఈ కేసు ఒకానొక దశలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అయితే, కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో.. చివరకు మంగళవారం తీర్పు వెలువడింది. పెద్ద సంఖ్యలో ప్రజలు, స్థానికులు.. తీర్పు వినేందుకు కోర్టుకు వచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మాన్వేంద్ర మిశ్ర.. దయానంద్ గోసాయిని దోషిగా తేల్చి.. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.10 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే, అసలైన కన్నయ్యకు ఏమైందో, ఎక్కడికి వెళ్లాడో ఇప్పటివరకు తెలియలేదు.
ఇదీ చదవండి: బ్రిడ్జిపైనుంచి దూకిన పేషెంట్.. పోలీసులు ఎలా కాపాడారంటే..?