ఇద్దరు పసిబిడ్డలను విధికి వదిలేసి ఆ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక పసిప్రాణం ఆకలికి తాళలేక కన్నుమూయడం విషాదాన్ని మరింత పెంచింది. ఈ దుర్ఘటన బెంగళూరు తిగళరపాళ్య చేతన్ కూడలి (Bangalore News) వద్దనున్న శంకర్ కుటుంబంలో పూడ్చలేని అగాథాన్ని సృష్టించింది. పుట్టింటినుంచి అత్తింటికి వెళ్లాలంటూ ఇంటి పెద్ద.. కుమార్తెకు చెప్పడమే పెనువిషాదానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధురాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు. సించన తొమ్మిది నెలల కుమారుడు ఆకలి తాళలేక మరణించాడు. ఆమె కుమార్తె ప్రేక్ష(3) స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
- ఈ చిత్రంలో చిన్నారి పాపను పట్టుకుని నిలుచున్న శంకర్ అనే వ్యక్తి ఇంటి పెద్ద. పాపకు ఆయన తాత వరుస. ఆ ఇద్దరూ తప్ప.. మిగిలిన నలుగురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీమంతం నాటి ఈ చిత్రం విషాద జ్ఞాపకంగా మారింది.
రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించనను తండ్రి శంకర్ కోరుతున్నారు. దీనిపైనే కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు. తన మాట ఎవరూ వినడం లేదని శంకర్ ఆదివారం ఇంటినుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో కాలం గడిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి అనుమానంతో కిటికీనుంచి చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. కుటుంబీకులు 5రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : తుపాకీ తూటాలకు బలైన ప్రేమికులు