ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖారే నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత నెలలో పదవీ విరమణ పొందారు. రెండేళ్ల పాటు కాంట్రాక్టు బేసిస్‌లో ఆయన పీఎంఓలో ప్రధాని సలహాదారుగా కొనసాగుతారని సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమిత్ ఖారే 1985 బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పలు హోదాల్లో కీలకంగా పనిచేశారు. సెప్టెంబర్ 30న పదవీ విరమణ పొందారు. పీఎంఓలో ప్రధానికి సలహాదారుగా ఆయన నియామకాన్ని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020 రూపకల్పనలోనూ ఖారే మంచి సహకారం అందించారు. 2018 మే నుంచి 2019 డిసెంబర్ వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో డిజిటల్ మీడియా కీలక నిబంధనల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించారు. అంతకుముందు 1990ల కాలంలో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అధికారిగా గుర్తింపు పొందారు.
ఇదీ చూడండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.750కోట్లు- యడ్డీ కుమారుడి ఫ్రెండ్స్వే!