Tiger cubs in Gummadapuram: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామస్థులకు చిక్కిన నాలుగు పెద్ద పులి పిల్లలను తిరిగి తల్లిచెంతకు చేర్చేందుకు.. అధికార్లు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. వాటికి పరీక్షలు నిర్వహించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు. సాధారణంగా పులి.. రెండు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ దీనికి భిన్నంగా పెద్ద పులి నాలుగు ఆడ పిల్లలను కనటం చాలా అరుదుగా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో బైర్లూటి కేంద్రానికి పిల్లలను తరలించారు. వాటిని ఏసీలో ఉంచి ఆహారం అందించారు. తల్లి పులి వద్దకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పెద్దపులి వల్ల భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు తల్లి పులితో పిల్లలను కలపడానికి ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు. అది సాధ్యం కాకపోతే... ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
నాలుగు పులి పిల్లలతో ఒక పులి వచ్చింది.. అవి వెళ్లే క్రమంలో విడిపోయాయి. పిల్లలు మాత్రమే ఉన్నాయి..పిల్లలను కలపాలని చూశాము.. కాని తల్లి ఇంకా రాలేదు. ఇక్కడ టెంపరేచర్ ఏక్కువగా ఉండటం వల్ల వాటిని వెటర్నరీ హాస్పటల్‌కి తీసుకు వేళ్తున్నాము.. ఈ రాత్రికి వాటిని తీసుకొచ్చి తల్లిని పిల్లలని కలుపుతాము.. అవి మొత్తం నాలుగు ఆడ పులి పిల్లలు.. సాధారణంగా ఒకటి లేదా రెండు పుడతాయి. కాని ఇక్కడ నాలుగు పిల్లలు పుట్టాయి.. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. సాధ్యమైనంత వరకూ తల్లీ పిల్లలను కలుపుతా.. అది కాక పోతే మా పై అధికారులు ఏది చెప్తే అది చేస్తాము...- మహమ్మద్ హయత్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీశైలం
ఇది జరిగింది.. గుమ్మడాపురం గ్రామం అడవిని ఆనుకొని ఉంటుంది. కొలను భారతి క్షేత్రానికి సమీపంలో సంగమేశ్వరం దారిలో ఈ గ్రామం ఉంది. ఓ రైతు ఉదయన్నే తన పొలానికి వెళ్లి వస్తుండగా.. అక్కడ నాలుగు పులి కూనలు కనిపించాయి. క్యూట్ క్యూట్‌గా.. బుజ్జిగా చూసేందుకు చాలా అందంగా ఉన్న పులి పిల్లలకు.. కుక్కలతో వాటికి ప్రమాదం పొంచి ఉందని భావించిన రైతు.. నాలుగు పులి పిల్లలను గ్రామస్థుల సాయంతో జాగ్రతగా ఇంటికి చేర్చారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే అక్కడ ఒకేసారి నాలుగు పులి పిల్లలు కనిపించటం వల్ల.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తల్లి పులి వాటిని వెతుకుతూ వస్తుందేమోనన్న భయంతో స్థానికులు.. పులి పిల్లలను ఓ గదిలో వదిలి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు వాటిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. తల్లి పులి.. పిల్లల కోసం అక్కడికి వస్తుందేమోనని అధికారులు అక్కడ నిఘా పెట్టారు. అయితే నీటి, ఆహారం కోసం సమీపంలో ఉన్న అడవి నుంచి దిగువ ప్రాంతానికి పులులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట ఇక్కడికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న నల్ల కాలువ సమీపంలో పులి ఆవుపై దాడి చేసింది. అలాగే భానుముక్కుల దగ్గర కూడా పెద్ద పులిని స్థానికులు చూశారు. ఇలా వరుస పులుల సంచారంతో చుట్టు పక్కల ప్రాంతాల వారు భయంతో వణికిపోతున్నారు.
ఇవీ చదవండి: