కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ప్రమాదం పొంచి ఉందని 'గ్రామీణ, వ్యవసాయ స్థితిగతుల నివేదిక-2020' హెచ్చరించింది. 'నెట్వర్క్ ఆఫ్ రూరల్ అండ్ అగ్రేరియన్ స్టడీస్' సంస్థ ఈ అధ్యయనం చేపట్టి, నివేదిక రూపొందించింది. సోమవారం దిల్లీ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వి.రామ్‌గోపాల్ రావు దీన్ని విడుదల చేశారు. పల్లెలు ఎదుర్కొంటున్న సమస్యలు, నూతన వ్యవసాయ చట్టాల వల్ల తలెత్తే పరిణామాలను ఈ నివేదిక విశ్లేషించింది. పంటల కొనుగోలులో మార్కెట్ యార్డులను తప్పించి, ప్రైవేటు వారిని అనుమతిస్తూ తీసుకొచ్చిన వ్యవసాయోత్పత్తుల వాణిజ్య(ప్రోత్సాహక, సమన్వయ) చట్టంతో భవిష్యత్తులో ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.
రైతులు స్థానికంగా తగిన ధరలు పొందడంలో కీలకపాత్ర పోషించే వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) మండీల వ్యవస్థ ధ్వంసమైతే... వారు ఎవరి మీద ఆధారపడలేని దుస్థితి ఎదురవుతుందని పేర్కొంది. "వ్యాపారులు, దళారులు, ప్రాసెసర్ల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు 1970ల్లో ఏంపీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ మండీలు కాలక్రమంలో ఆర్థిక, వ్యాపార, ప్రాసెసింగ్, రవాణా విషయాల్లో బలంగా వేళ్లూనుకున్న కుటుంబాల నియంత్రణలోకి వెళ్లాయి. వీటికి జవాబుదారీతనం కొరవడటం వల్ల రైతులకు సమస్యలు మొదలయ్యాయి. స్థానిక మార్కెట్లుకు సరఫరా పెరిగి ధరలు కుప్పకూలాయి. దీంతో రవాణా ఖర్చులకు భయపడి చిన్న, సన్నకారు రైతులు కళ్లాల వద్దే స్థానిక వ్యాపారులకు అమ్ముకోవడం మొదలుపెట్టారు. 1990ల్లో వచ్చిన సరళీకృత ఆర్థికవిధానాలతో ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చి, వ్యవసాయాధార వ్యాపారాలు వృద్ధి చెందాయి. మరోపైపు.. ఆన్లైన్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లు, కార్పొరేటు సంస్థలు నేరుగా రైతులు, ప్రైవేటు, మార్కెట్ల నుంచి సరకును కొనుగొలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి.
అక్కడ కంపెనీలదే గుత్తాధిపత్యం
- ప్రైవేటు మార్కెట్ యార్డుల్లో బేరసారాలు ఆడేందుకు రైతుల శక్తిసామర్థ్యాలు సరిపోవు. ప్రభుత్వ మండీల్లోనైతే వ్యాపారులకు వ్యతిరేకంగా రైతులు ఫిర్యాదు చేసి, చర్యల కోసం డిమాండ్ చేసే అవకాశముంది. ప్రైవేటు మార్కెట్లను ప్రోత్సహించే బదులు... ప్రభుత్వ మండీలను సంస్కరించి, వాటి జవాబుదారీతనాన్ని పెంచడమే శ్రేయస్కరం.
- బిహార్‌లో ఏపీఎంసీ చట్టాన్ని 2006లో రద్దు చేశారు. ఆ తర్వాత కొనుగోలుదారుల్లేక కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వచ్చింది.
- ఆన్లైన్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పాల్గొనేందుకు పంట భారీగా ఉండాలి. 90శాతం మంది రైతులకు అది సాధ్యంకాదు.
- ధరల హామీ చట్టంతో ఒప్పంద సేద్యం బలపడుంది. ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా కార్పొరేట్ సంస్థలు సాగుచేస్తే... దేశంలో పంటల వైరుద్ధ్యం దెబ్బతింటుంది.
- 70 శాతం విత్తన, వ్యవసాయ రసాయన మార్కెట్‌ను నాలుగు సంస్థలు శాసిస్తున్నాయి. ఆహార మార్కెటింగ్, రీటైలింగ్పై కార్పొరేట్ సంస్థల ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతుంది.
- పత్తి,సోయా వంటి పంటలు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. వ్యవసాయ రసాయనాలు, యంత్రాలు, శుద్ధి, కమోడిటీ ట్రేడింగ్, సూపర్ మార్కెట్ల నిర్వహణను బడా సంస్థలను నియంత్రిస్తున్నాయి. ఇలాంటి సంస్థలు నియంత్రించి, జవాబుదారీగా ఉండేలా చేయడం అసాధ్యం.
- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో బహుళ జాతి సంస్థలే లాభపడ్డాయి. ఆయా దేశాల్లో ధరల హెచ్చుతగ్గులను ఆసరాగా చేసుకొని ఇవి పెద్దఎత్తున వ్యవసాయోత్పత్తులను నిల్వ చేస్తున్నాయి" అని నివేదిక పేర్కొంది.