నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరావట్లేదు. గురువారం ఎనిమిది గంటల పాటు సంప్రదింపులు జరిగినా ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో చర్చలను శనివారానికి వాయిదా వేయడంతో హస్తిన సరిహద్దుల్లో అన్నదాతల నిరసన కొనసాగుతూనే ఉంది. వరుసగా 9వ రోజు దిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై బైఠాయించిన రైతులు శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీ సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు కూడా కొనసాగుతోంది.
దిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు..
రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. శుక్రవారం కూడా సింఘు, టిక్రి, లాంపూర్,సఫియాబాద్, సబోలి తదితర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. 44వ జాతియరహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించారు. ఝతికరా సరిహద్దులో కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని దిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలతో దూరం పెరగడమేగాక, రద్దీ కూడా విపరీతంగా ఉంటుండటంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు దిల్లీ-యూపీ మార్గాన్ని కూడా రైతులు నిర్బంధించారు.
మరోవైపు రైతుల ఆందోళనకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి. అన్నదాతలకు తమ మద్దతు తెలిపిన ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నేడు దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనే అవకాశముంది.
దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం రైతులు, కేంద్ర మంత్రులకు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. మూడు చట్టాల్లోని అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది. అయితే కేంద్రం వివరణను రైతు నాయకులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయని రైతులు తమ వాదన వినిపించారు. అయితే ఈ అంశంపై నిర్ణయం తేలకపోవడం వల్ల శనివారం మరోమారు భేటీ కానున్నారు.