అంతరించిపోయే దశలో ఉన్న ఓ పామును అక్రమ రవాణా చేస్తూ అటవీ శాఖ అధికారులకు చిక్కారు కొందరు స్మగ్లర్లు. రూ.కోటి విలువ చేసే పామును వీరు స్మగ్లింగ్ చేస్తున్నారు. బంగాల్లోని సిలిగుడిలో ఈ ఘటన జరిగింది. మొత్తం నలుగురు స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. సిలిగుడి మున్సిపాలిటీలోని శాస్త్రి నగర్లో నిందితులు పట్టుబడ్డారని అధికారులు వెల్లడించారు. వారిని జల్పాయ్గుడి కోర్టులో హాజరుపర్చారు. ఈ స్మగ్లింగ్ వెనక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టైన నిందితుల నుంచి 'రెడ్ శాండ్ బోవా' అనే అరుదైన జాతికి చెందిన సర్పాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మార్కెట్లో ఇది రూ.కోటి వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆ పామును బిహార్ నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. బైకాంతపుర్ ఫారెస్ట్ డివిజన్లోని ఓ ఇంట్లో దీన్ని ఉంచారని చెప్పారు. దీనికి గురించి సమాచారం అందగానే.. బేలాకోబా రేంజ్ అధికారి సంజయ్ దత్తా నేతృత్వంలోని బృందం స్మగ్లర్లపై దాడి చేసింది. నాలుగు అడుగుల ఐదు అంగుళాలు ఉన్న పామును దత్తా టీమ్ స్వాధీనం చేసుకుంది. పాము 4.5 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నలుగురు నిందితులను అరిందమ్ సర్కార్, పెషాంగ్ లామా షెర్పా, అన్వర్ మియా, జగదీశ్ చంద్ర రాయ్లుగా గుర్తించారు.
పామును విక్రయించేందుకే నిందితులు సిలిగుడికి వచ్చారని అధికారులు చెబుతున్నారు. దీని గురించి ముందస్తు సమాచారం అందడం వల్ల నిందితుల ప్లాన్ ఫలించలేదని అన్నారు. 'పామును బిహార్ నుంచి అన్వర్ తీసుకొచ్చాడు. పాము ధరను రూ.కోటిగా నిర్ణయించారు. ముందుగా రూ.20వేలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అరిందమ్ను అన్వర్ డిమాండ్ చేశాడు. శాస్త్రి నగర్లోనే డబ్బులు మార్చుకున్నారు' అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పెషాంగ్ లామాతో పాము స్మగ్లింగ్ విషయమై నిందితులు చర్చలు జరుపుతున్నారని అధికారులు వివరించారు. అతడితో డీల్ మాట్లాడుకునేందుకే వీరంతా శాస్త్రి నగర్లో మకాం పెట్టారని చెప్పారు. మిగిలిన నిందితుల్లో ఎవరిది ఏ పాత్ర అనే విషయంపై విచారణ జరుపుతున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తం ఏదైనా ఈ ఘటనలో ఉందేమోనని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.