న్యాయవాదిగా మూడేళ్లు అనుభవం ఉంటేనే న్యాయాధికారి ఉద్యోగాల పరీక్షలు రాయడానికి అర్హత పొందినట్టుగా నిబంధన పెట్టాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. క్షేత్రస్థాయి అనుభవం లేకపోవడంతో కొంత మంది న్యాయాధికారులు కోర్టు వ్యవహారాలను సక్రమంగా చూడలేకపోతున్నారని, అందువల్ల ఈ నిబంధన విధించాలని విజ్ఞప్తి చేయనుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం లా డిగ్రీ పాసయిన వారు ఎవరైనా జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి అర్హులు. వారికి ఎలాంటి క్షేత్రస్థాయి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. న్యాయవాదిగా ఎలాంటి అనుభవం లేకుండా మేజిస్ట్రేటు, జడ్జి పదవులు చేపట్టిన వారికి ఇతర న్యాయవాదులు, కక్షిదారులతో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదని బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి కూడా ఇదో కారణమని చెప్పారు.
ఇదీ చదవండి: మంత్రివర్గ విస్తరణలో సింధియా వర్గానికి మళ్లీ అవకాశం