ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ముందే సిబ్బందికి కరోనా టీకా అందించనున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు టీకా పొందడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న వారిని కరోనా యోధులుగా(ఫ్రంట్‌లైన్ వారియర్స్) ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించనుందని తెలిపింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా టీకా పంపిణీతో ఎన్నికలు నిర్వహణ సులువైందని సీఈసీ సునీల్ అరోడా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కరోనా నేపథ్యంలో..
కరోనా నేపథ్యంలో గడప గడపకూ ప్రచారంలో భాగంగా.. అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని సునీల్ అరోడా తెలిపారు. రోడ్ షోలకు గరిష్ఠంగా ఐదు వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామపత్రాలు దాఖలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని సీఈసీ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆయా చోట్ల కేంద్ర బలగాలను(సీఏపీఎఫ్) మోహరించనున్నట్లు వివరించారు.
ఓటర్లు 18కోట్లకు పైనే..
"ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 824 నియోజకవర్గాల్లో దాదాపు 18.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం" అని సునీల్ తెలిపారు.
ఇదీ చదవండి: బంగాల్లో 8 దశల్లో పోలింగ్- మే 2న ఫలితం