భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశం గట్టిగా నిలబడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా ప్రతిమ వద్ద మోదీ నివాళులు అర్పించారు.
"మన దేశ ఐక్యత శత్రువులకు కంటగింపుగా మారింది. అందుకే ఈ ఐక్యతను విడగొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే కాదు, వేల సంవత్సరాలుగా విదేశీ శక్తులు భారత ఐక్యతను విడగొట్టేందుకు ప్రయత్నించాయి. ఆనాటి విషపూరిత యత్నాల వల్ల ఇప్పటికీ దేశం సమస్యలు ఎదుర్కొంటోంది. దేశవిభజనను, దాన్నుంచి శత్రువులు ప్రయోజనం పొందడాన్ని మనం కళ్లారా చూశాం. ఇప్పటికీ ఆ శక్తులు క్రియాశీలంగా ఉన్నాయి. దేశప్రజలు.. కులం, ప్రాంతం, భాషల పేర్లు చెప్పి ఘర్షణ పడాలని కోరుకుంటున్నాయి. వారందరికీ మనం సమాధానం చెప్పాలి. ఐక్యంగానే ఉంటామని చాటాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మోదీ ఎమోషనల్..
ఈ సందర్భంగా గుజరాత్‌లో తీగల వంతెన కూలిన దుర్ఘటనను తలుచుకుని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంతటి బాధను అనుభవించ లేదని అన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లిందన్నారు.
"ప్రస్తుతం నేను ఏక్తానగర్‌లో ఉన్నా... నా మనసు మాత్రం మోర్బీ బాధితుల వద్దే ఉంది. నా జీవితంలో ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఒక వైపు బాధతో కూడిన హృదయం ఉంది. మరోవైపు కర్తవ్యం నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. ఆ కర్తవ్య బోధను అనుసరించి నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 130 మందికి పైగా మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కొంతమంది ఆకతాయిలు అటూఇటూ ఊపగా.. వంతెన కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకొచ్చింది. ఈ దృశ్యాలు చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.