వరుసగా రెండు పర్యాయాలు అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా.. ఆదాయం విషయంలోనూ మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటుతోంది. ఏటేటా తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి రూ.2,410.09 కోట్ల ఆదాయం సమకూరగా, 2019-20లో ఏకంగా 50.34 శాతం అధికంగా రూ.3,623.28 కోట్లు(Electoral bonds Bjp) వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ ఆదాయం 25.69 శాతం తగ్గిపోయింది. 2018-19లో ఆ పార్టీకి రూ.918.03 కోట్లు ఆదాయం రాగా, మరుసటి ఆర్థిక సంవత్సరంలో రూ.682.21 కోట్లు మాత్రమే వచ్చాయి. శాతాల వారీగా చూస్తే ఆదాయ పెరుగుదలలో మరో జాతీయ పార్టీ ఎన్సీపీ మొదటి స్థానంలో ఉంది. 2018-19లో ఆ పార్టీకి రూ.50.71 కోట్లు సమకూరగా 2019-20లో 68.77 శాతం అధికంగా రూ.85.583 కోట్లు వచ్చింది.
జాతీయ పార్టీల ఆదాయ, వ్యయ వివరాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)(adr report) సంస్థ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2019-20లో వచ్చిన ఆదాయంలో భాజపా 54.57 శాతమే(రూ.1,651.022 కోట్లు) ఖర్చు చేసింది. అదే ఏడాది కాంగ్రెస్ తన ఆదాయం కన్నా 46.31 శాతం అధికంగా వ్యయం చేసింది. 2019-20లో తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.143.676 కోట్లు సమకూరగా, అందులో 74.67 శాతం(రూ.107.277 కోట్లు) ఖర్చు పెట్టింది. 7 జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, తృణమూల్, సీపీఐల మొత్తం ఆదాయం(2019-20లో) రూ.4,758.206గా ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అదే ఏడాదికిగానూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకూ ప్రకటించిన ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం ఆదాయం 3,441.324 కోట్లు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏడీఆర్ సేకరించిన వివరాల ప్రకారం అన్ని పార్టీలు కలిపి రూ.3,429.5586 కోట్ల ఎన్నికల బాండ్ల ఆదాయాన్ని పొందినట్లు తేలింది. ఇందులో 87.29 శాతం భాజపా, కాంగ్రెస్, తృణమూల్, ఎన్సీపీలకే వచ్చింది. ఎన్నికల బాండ్ల ద్వారా భాజపాకు రూ.2,555 కోట్లు, కాంగ్రెస్ రూ.317.861 కోట్లు, తృణమూల్ రూ.100.4646 కోట్లు, ఎన్సీపీ రూ.20.50 కోట్లు సమకూరాయి.
విరాళాల్లోనూ కమలం గలగల
భాజపా అత్యధికంగా విరాళాల రూపంలో రూ.3,427.775 కోట్లు పొందినట్లు ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు రూ.469.386 కోట్లు, తృణమూల్‌కు రూ.108.548 కోట్లు, సీపీఎంకు రూ.93.017 కోట్లు, సీపీఐ రూ.3.024 కోట్లు విరాళంగా వచ్చినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: ఉద్ధవ్, ఫడణవీస్ మధ్య రహస్య భేటీ!