ED Summons Jharkhand CM Hemant Soren : మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోరెన్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. సోరెన్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది రెండోసారి కాగా.. ఏ కేసులో తాజాగా సమన్లు పంపించారనే విషయం తెలియలేదు.
Hemant Soren Illegal Mining Case : అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో సోరెన్‌కు గతేడాది ఈడీ సమన్లు ఇచ్చింది. మైనింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన్ను ప్రశ్నించింది. నవంబర్ 17న ఈడీ ఎదుట హాజరైన సోరెన్.. 9 గంటల పాటు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. గతంలో సోదాలు చేపట్టిన సమయంలో సీఎం సోరెన్.. ఈడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈ కుట్రలు చేస్తున్నారంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లలోనే ఎందుకు సోదాలు జరుగుతున్నాయంటూ ప్రశ్నించారు.
కాగా, రూ.వెయ్యి కోట్ల అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నేరాలను ఇప్పటివరకు గుర్తించినట్లు ఈడీ గతేడాది వెల్లడించింది. ఝార్ఖండ్‌లోని సాహిబ్ గంజ్, బర్హైత్, రాజ్‌మహల్, మీర్జా చౌకీ, బర్హర్వాలోని 19 ప్రదేశాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అనుమానిస్తోంది. ఈ కేసులతో హేమంత్ సోరెన్‌కు సన్నిహితుడైన పంకజ్ మిశ్రకు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తూ ఆయనపై దాడులు చేసింది. టోల్‌ప్లాజా టెండర్ స్కామ్‌కు సంబంధించిన ఆరోపణలు సైతం సోరన్పై ఉన్నాయి. ఈ కేసులో సోరెన్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో టోల్ ప్లాజా టెండర్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది.
అనర్హతకు ఎన్నికల సంఘం సిఫార్సు
ఇక, మైనింగ్ లీజును హేమంత్ సోరెన్.. తనకు తానే కేటాయించుకున్నారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై అనర్హత వేయాలంటూ రాష్ట్ర గవర్నర్‌కు గతేడాది ఆగస్టులో సిఫార్సు చేసింది. ఈ పరిణామాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్న ప్రచారం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. హేమంత్ సోరెన్.. తన భార్య కల్పనా సోరెన్‌కు బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ పండితులు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటివరకు సోరెన్‌పై అనర్హత పడలేదు.
ఈడీ విచారణకు సీఎం డుమ్మా.. దమ్ముంటే అరెస్టు చేయండంటూ సవాల్
విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. సభ నుంచి భాజపా వాకౌట్