Dawood Ibrahim in Karachi: కీలక కేసుల్లో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక సమాచారం రాబట్టింది. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు ఈడీకి అతడి సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్ తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా కీలక సమాచారాన్ని అలిశా పార్కర్ ఈడీకి అందించినట్లు పేర్కొన్నాయి.
మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని అలిశా పార్కర్‌కు పలుమార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు అతడు తెలిపాడు. అలిశా పార్కర్ వాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. " నేను పుట్టక ముందే దావూద్ ముంబయి వదిలి వెళ్లాడు. దావూద్ మా మామ. 1986 వరకు దంబర్వాలా భవన్లో నివసించాడు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉన్నట్లు చాలా మంది మా బంధువుల ద్వారా తెలిసింది. వాళ్లు భారత్‌ను విడిచివెళ్లినప్పుడు నేను ఇంకా పుట్టనేలేదు. వారితో నేను, నా కుటుంబం కాంటాక్ట్‌లో లేము. కానీ, కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు మా మామ దావూద్ భార్య మెహ్జబీన్.. నా భార్య ఆయేషా, నా సోదరినులతో మాట్లాడినట్లు తెలుసు." అని అలిశా పార్కర్ చెప్పినట్లు పేర్కొన్నాయి.
కేంద్రం చర్యలు తీసుకోవాలి: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే. ఇన్నాళ్లు ఆచూకీ తెలియదని, ఇప్పుడు తెలిసిన క్రమంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: అండర్‌వరల్డ్ డాన్ 'దావూద్' గ్యాంగ్‌లో ఇద్దరు అరెస్ట్.. చోటా షకీల్‌తో!