Does Government Have Rights To Open Parcel : ఇటీవలే జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదం తెలిపిన పోస్టాఫీస్ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వానికి కీలక అధికారాలు లభించనున్నాయి. పోస్టాఫీస్ ద్వారా వచ్చిన ఏదైనా వస్తువు లేదా కవరును తెరచి చూసి ప్రభుత్వ అధికారులు చూడవచ్చు. అవసరమైన వాటిని స్వాధీనం కూడా చేసుకోవచ్చు.
పార్సిల్ ఓపెన్ లేదా స్వాధీనం!
బిల్లు ప్రకారం, దేశ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో పోస్టాఫీస్ ద్వారా వచ్చిన వస్తువు లేదా కవర్‌ను తెరిచి చూడొచ్చు. పరిస్థితుల అనుగుణంగా వాటిని అధికారులు స్వాధీనం కూడా చేసుకోవచ్చు. దీని కోసం ఏ అధికారికైనా అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వొచ్చు.
పన్ను కట్టకపోయినా స్వాధీనం!
బిల్లు ప్రకారం, ఏదైనా పార్సిల్‌కు సంబంధించి పన్ను కట్టకపోయినా, అందులో ఉన్న వస్తువు చట్టప్రకారం నిషేధమైనా వాటిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. సంబంధిత అధికారులకు అందజేయవచ్చు. ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించొచ్చు.
పార్సిల్ డ్యామేజ్ అయినా సంబంధం లేదు!
సవరణ బిల్లు ప్రకారం పోస్ట్ ద్వారా వచ్చిన పార్సిల్ డ్యామేజ్ అయినా, తప్పుడు డెలివరీ అయినా, ఆలస్యం అయినా పోస్టాఫీస్ అధికారులు ఎలాంటి బాధ్యత వహించరు. ఒకవేళ పోస్టాఫీస్ అధికారి ఉద్దేశపూర్వకంగా లేక మోసపూరితంగా ఈ చర్యలకు పాల్పడితేనే బాధ్యత వహిస్తారు.
ప్రతి ఒక్కరూ ఛార్జీలు చెల్లించాల్సిందే!
సవరణ బిల్లు ప్రకారం పోస్టాఫీస్ ద్వారా పొందిన సేవలకు ప్రతి ఒక్కరూ రుసుము చెల్లించాల్సిందే. ఒకవేళ ఛార్జీలు చెల్లించడానికి నిరాకరించినా లేదా నిర్లక్ష్యం చేసినా, సదరు వ్యక్తికి పోస్టాఫీస్ ద్వారా రావాల్సిన సొమ్ములో నుంచి వసూలు చేస్తారు.
కేంద్ర ప్రభుత్వం సూచించిన అన్ని సేవలను పోస్టాఫీస్ అందించాలని, ఆ సేవలను అందించడానికి నిబంధనలు రూపొందించాలని బిల్లు చెబుతోంది. అలాంటి సేవలకు ఛార్జీలను నిర్ణయించాలని కూడా బిల్లు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఉన్న బాధ్యతలు మినహా ఇండియా పోస్ట్ తన సేవలకు సంబంధించి ఎలాంటి ఇతర బాధ్యతను భరించబోదని ఈ బిల్లు చెబుతోంది.
అయితే డిసెంబర్లో రాజ్యసభలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వివిధ కారణాలతో పార్సిళ్లను తెరిచి చూడడం లేదా స్వాధీనం చేసుకునే అధికారాన్ని పోస్టల్ అధికారికి కట్టబెట్టడం వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘనకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 1968లో లా కమిషన్ ఇచ్చిన నివేదికను గుర్తు చేశాయి. సవరణ బిల్లులో ఉన్న ఎమర్జెన్సీ అంశం అస్పష్టంగా ఉందని ఆరోపించాయి.
కొత్త బిల్లు ద్వారా ప్రజలు వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కోల్పోతారని విపక్షాలు వాదించాయి. ఎమర్జెన్సీ అనే పదం 1975 జూన్‌లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని సూచిస్తుందా? అని ప్రశ్నించాయి. దేశంలోని తపాలా కార్యాలయానికి సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడం, సవరించడం, దానితో అనుసంధానించడమే ఈ బిల్లు లక్ష్యమని, దేశ భద్రత కోసమే ఈ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.