కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కొవిడ్ విజృంభణ వేళ.. వైద్యులకు కరోనా మహమ్మారితో పాటు భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి నుంచి రక్షణ కావాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"వైద్యులకు కరోనా వైరస్‌తోపాటు భాజపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నుంచి రక్షణ కావాలి. ప్రాణదాతలను రక్షించాలి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
వ్యాక్సిన్లపై అన్ని రాష్ట్రాలు తమ గళాన్ని వినిపించాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నేను జగన్ మోహన్‌రెడ్డిని ఈ ప్రశ్నలు అడగుతున్నాను. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర వర్సెస్ రాష్ట్రం అనే పరిస్థితిని తీసుకువచ్చింది ఎవరు? 18 నుంచి 44 ఏళ్ల వారికి కేంద్రం టీకా పంపిణీ చేయలేదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది ఎవరు? ఈ విధానాన్ని తీసుకువచ్చేముందు రాష్ట్రాలను ఎందుకు సంప్రదించలేదు? ఈ ప్రశ్నలన్నింటినీ మీరు మోదీని ఎందుకు అడగరు?"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలుగా తయారైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ గళాన్ని వినిపించాలని అన్నారు. అయితే.. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వేలెత్తి చూపుతూ రాజకీయాలు చేయొద్దని పేర్కొన్నారు.
'ఉచితంగా అందజేయండి'
దేశంలో మ్యూకర్మైకోసిస్(బ్లాక్‌ఫంగస్) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధి చికిత్సలో అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లను ఉచితంగా ప్రజలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. రాష్ట్రాలవారీగా ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్యను బహిరంగంగా ఉంచాలని కోరారు.
ఇదీ చూడండి: ఆ రోజులు పోయాయ్: ప్రధాని మోదీ
ఇదీ చూడండి: కొవిడ్ రెండో దశ విజృంభణకు కారణమిదే..!