శస్త్రచికిత్సలు కొంతమంది పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి సమయం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్‌కు స్పష్టంగా తెలుసు. అందుకే తాను ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్థం చేసుకున్నారు. వెంటనే కారు దిగి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి పరుగుతీశారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలో మణిపాల్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఆయన ఉదయం 10 గంటలకు ఒక మహిళకు పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటం వల్ల ఆయన చిక్కుకుపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడం వల్ల ఒక నిర్ణయానికి వచ్చారు. కారు దిగి, మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే ఆపరేషన్‌కు రెడీ అయ్యి పేషెంట్ ప్రాణాలు కాపాడారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడం వల్ల సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
"ఆగస్టు 30న ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాను. సర్జరీ ఆలస్యమవుతుందని గ్రహించి పరిగెత్తుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. గూగుల్ మ్యాప్స్ సాయంతో సర్జాపుర్- మరాతహళ్లి మార్గంలో పరిగెత్తి ఆస్పత్రికి చేరుకున్నాను. నేను రెగ్యులర్‌గా జిమ్ చేయడం వల్ల రన్నింగ్ నాకు తేలికైంది."
--డాక్టర్ గోవింద్ నందకుమార్
తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్న భావనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెబుతున్నారు. డాక్టర్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి డాక్టర్ల వల్లే వైద్యవృత్తిపై గౌరవం మరింత పెరుగుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.