Brother carrying sister on doli: దివ్యాంగురాలైన సోదరి కల సాకారం చేసేందుకు అండగా నిలిచారు ఈ సోదరులు. పరీక్షలు రాసేందుకు తనంతట తాను వెళ్లలేని ఆ చెల్లిని.. డోలీలో కూర్చోబెట్టుకుని తమ భుజాలపై మోస్తూ సుమారు అర కిలోమీటర్ దూరంలోని పరీక్షా కేంద్రానికి చేర్చారు. పరీక్షలు జరిగినన్ని రోజులు డోలీలో చెల్లిని మోసుకెళ్తున్న సోదరుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చెల్లి కోసం సోదరులు పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉత్తరాఖండ్, పిథౌరాగఢ్ జిల్లాలోని చమాలీ గ్రామానికి చెందిన సంజన దివ్యాంగురాలు. సోదరులు పరాస్, ఆకాశ్, సోదరి సానియా. తండ్రి గోవింద రాజన్ ఆరేళ్ల క్రితం చనిపోయారు. తల్లి డంగ్రీ ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. తండ్రి మరణం తర్వాత వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సంజన.. బాగా చదువుకుని టీచర్ కావాలనుకుంది. అందుకు తగినట్లుగానే చదువులో ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తోంది. వారి ఇంటి నుంచి పరీక్షా కేంద్రం శైలకుమారి ఇంటర్ కళాశాల సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో రోజూ పరీక్షా కేంద్రానికి వెళ్లలేని పరిస్థితిలో లోధియాగైర్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా సుమారు 0.5 కిలోమీటర్లు ప్రయాణించాలి.
నడవలేని సోదరిని డోలీలో రోజు అర కిలోమీటర్ మోసుకెళ్లి పరీక్షలు రాయిస్తున్నారు సోదరులు. వారి వీడియో వైరల్గా మారిన క్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిశ్ చౌహాన్ స్పందించారు. సంజన పరీక్షా కేంద్రాన్ని చమాలీలోని జీఐసీకి మార్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా సాయం అందిస్తామని భరోసా కల్పించారు.
ఇదీ చూడండి: చీర సాయంతో వందలాది ప్రాణాలు కాపాడిన బామ్మ