Dera Baba Z plus security: హత్య, లైంగిక వేధింపుల కేసుల్లో జైలు అనుభవిస్తూ ఇటీవల సెలవులపై విడుదలైన డేరా సచ్ఛా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హరియాణా ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. ఖలిస్థానీ అనుకూల వర్గాల నుంచి రహీమ్‌కు ప్రాణముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
Dera Baba security:
'ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి రామ్ రహీమ్‌కు ముప్పు ఉందని హోంశాఖ నుంచి సమాచారం అందింది. రామ్ రహీమ్ దోషిగా తేలక ముందు నుంచే ఆయనకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు తాజా నిర్ణయం తీసుకున్నాం' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జడ్ ప్లస్ భద్రతపై రోహ్తక్ రేంజ్ కమిషనర్‌కు సీఐడీ ఏడీజీ ఫిబ్రవరి 6న లేఖ రాశారని వెల్లడించాయి.
డేరా బాబాగా పిలుచుకునే ఈ ఆధ్యాత్మిక గురువు ఫిబ్రవరి 7న జైలు నుంచి విడుదలయ్యారు. అంతకు ఒకరోజు ముందే జడ్ ప్లస్ భద్రతపై సీఐడీ అధికారులు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలులో ఉన్న ఆయన.. మూడు వారాల సెలవులపై బయటకు వచ్చారు. 54 ఏళ్ల డేరా బాబా.. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన నేరానికి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు 2017 ఆగస్టులో ఆయనను దోషిగా తేల్చింది. దీంతో పాటు, 2019లో జర్నలిస్టు రామ్‌చంద్ర ఛత్రపతి, 2021లో డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్యల కేసుల్లో ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి.
ఇదీ చదవండి: 'డేరా బాబాకు 3,500 మందితో భద్రతా? ఆయనేమైనా ప్రధాన మంత్రా?'