Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కేసులో ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ బుధవారంతో ముగియడం వల్ల సిసోదియాను దిల్లీ రౌస్‌అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. దీంతో ఏప్రిల్ 5 వరకు సిసోదియాకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు మతపరమైన, ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకునేందుకు అనుమతినివ్వాలని సిసోదియా కోర్టుకు విన్నవించగా.. దరఖాస్తు చేసుకుంటే అంగీకరిస్తామని ధర్మాసనం తెలిపింది. మరోవైపు దిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న నగదు అక్రమ చలామణి కేసులోనూ బెయిలు కోసం మంగళవారం కోర్టును సిసోదియా ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 25లోగా స్పందన తెలపాలని ఈడీని న్యాయస్థానం ఆదేశించింది.
'నా భార్యకు అనారోగ్యం.. బెయిల్ ఇవ్వండి'
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కోర్టుకు చెప్పారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఆయన తరఫు న్యాయవాది మంగళవారం ఈ మేరకు వాదనలు వినిపించారు. 'సిసోదియా ప్రజాసేవకుడు. ఆయన విదేశాలకు పారిపోయే ముప్పు లేదు కనుక కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. దిల్లీ మద్యం విధానంలో మార్పులు చేసేందుకు ఆయన ముడుపులు స్వీకరించినట్లు నిరూపించే ఆధారాలేవీ లభించలేదు. ప్రస్తుతం ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొడుకు విదేశాల్లో ఉండటం వల్ల ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపైనే ఉంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయండి' అంటూ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వినతిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోదియా అమాయకుడేమీ కాదని కోర్టుకు తెలిపింది. దిల్లీ ప్రభుత్వంలో 18 శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారని చెప్పింది. ఆయన బయటికొస్తే సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రమాదముందని కోర్టుకు విన్నవించింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ మార్చి 24కు వాయిదా పడింది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోదియాను ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. ఆ తర్వాత 27న కోర్టులో హాజరుపరచి.. కోర్టు ఆదేశాలతో సిసోదియాను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టైన తరుణంలో.. ఫిబ్రవరి 28న మనీశ్ సిసోదియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఇదీ కేసు
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు ఉన్నాయన్న లెప్టినెంట్ గవర్నర్ ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది. మద్యం తయారీదారులు, టోకు, రిటైల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారని ప్రధానంగా ఆరోపించారు. ఈ మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకముందే.. వాటి వివరాలు వ్యాపారుల వాట్సాప్ గ్రూప్‌లలో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు, ఇదే కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది.
ఇవీ చదవండి : బాంబుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం
భూకంపం వేళ మహిళకు డెలివరీ.. ఆస్పత్రి మొత్తం షేక్ అయిపోతున్నా..