గణతంత్ర దినోత్సవాన రైతుల ఉద్యమం దిల్లీలో దారి తప్పడం... ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడం.. వంటి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది వేళ్లు ఓ వ్యక్తివైపు చూపిస్తున్నాయి. ఉద్యమాన్ని అతనే పక్కదారి పట్టించాడని.. ట్రాక్టర్ల ర్యాలీ ఎర్రకోట వైపు వెళ్లేలా చేశాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. శాంతియుతంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని అపఖ్యాతి పాల్జేయడానికి ప్రయత్నించాడని ధ్వజమెత్తుతున్నాయి. అతనే పంజాబీ నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ. ఎర్రకోటపై మంగళవారం జెండా ఎగురవేసిన ఆందోళనకారుల్లో అతనూ ఉన్నాడు. దీనికి కీలక సూత్రధారి కూడా అతనేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎవరీ దీప్ సిద్ధూ?
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాకు చెందిన దీప్ లా చదివాడు. గతంలో మోడల్‌గా పనిచేసి.. తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమంలో గతేడాది చేరాడు. అప్పటి నుంచీ అతణ్ని ప్రభుత్వానికి ఏజెంటుగా పలు సంఘాలు అనుమానిస్తూ వస్తున్నాయి. అతని పాత్రను శంకిస్తూనే ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేవోల్‌కు దీప్ సిద్ధూ గతంలో సన్నిహితంగా ఉండేవాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సన్నీ దేవోల్ పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన తరఫున ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. అయితే.. గతేడాది దీప్ రైతుల ఉద్యమంలో చేరడం వల్ల అప్పటి నుంచి సన్నీ దేఓల్ అతడిని దూరం పెడుతూ వచ్చారు. కాగా ట్రాక్టర్ ర్యాలీతో వచ్చిన ఆందోళనకారులు ఎర్రకోట వద్ద మతపరమైన జెండాను ఎగురవేయడాన్ని దీప్ మంగళవారమే సమర్థించాడు. తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని సిక్కు మత చిహ్నమైన 'నిశాన్ షాహిబ్' జెండాను మాత్రమే తమ ఉద్యమానికి గుర్తుగా పెట్టినట్లు చెప్పాడు. కిసాన్ మజ్దూర్ ఏక్తా నినాదాన్ని చేసినట్లు పేర్కొంటూ అతను సామాజిక మాధ్యమాల్లో వివరణ ఇచ్చాడు.
ఆ ధర్నాతో వెలుగులోకి..
రైతు సంఘాలు గతేడాది సెప్టెంబరు 25న బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా చేపట్టిన ఆందోళనల ద్వారా తొలిసారి దీప్ సిద్ధూ క్రియాశీల పాత్ర పోషించాడు. మరికొందరితో కలిసి దిల్లీ-హరియాణాల మధ్య షంబు సరిహద్దు వద్ద బైఠాయించి ధర్నాకు దిగడం వల్ల అందరి దృష్టినీ ఆకర్షించాడు. అతనికున్న ప్రజాదరణ నేపథ్యంలో కొన్ని రైతు సంఘాలు తమ వాస్తవ ఎజెండాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా భయపడ్డాయి. అతను వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తున్నాడన్న ఆరోపణలు చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్, సిక్కు వేర్పాటువాది భింద్రన్‌వాలేలను దీప్ సిద్ధూ తరచూ ప్రస్తావిస్తుండేవాడని చెబుతుంటారు. అతని ప్రసంగాలు కూడా రాష్ట్రాలకు మరిన్ని హక్కులు అనే అంశంపైనే ఎక్కువగా ఉండేవని చెబుతున్నారు. కాగా ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ధోరణిలో వ్యవహరించిన వారితో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే 41 రైతుల సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. తమ శాంతియుత ఉద్యమంలోకి 'అసాంఘిక శక్తులు' ప్రవేశించాయని ఆరోపించింది.
అతనితో సంబంధాల్లేవ్!
"దీప్ సిద్ధూతో నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధాల్లేవు. డిసెంబరు 6వ తేదీనే ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని నేను స్పష్టం చేశాను. ఎర్రకోట వద్ద మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర విచారకరం."
- సన్నీ దేఓల్, భాజపా ఎంపీ
దీప్ ప్రభుత్వ ఏజెంటు
"దీప్ సిద్ధూ ప్రభుత్వానికి ఏజెంటు. కేంద్రం ఆదేశానుసారమే అతను రైతు ఉద్యమాన్ని అపఖ్యాతి పాల్జేశాడు. అతను యువతను ఎర్రకోటవైపు తీసుకెళ్లి తప్పుతోవ పట్టించాడు. ఇలాంటి వ్యక్తులను మేమెప్పుడూ మా దరికి రానివ్వం. అతడిని ఎప్పుడూ విశ్వసించలేదు."
- సుఖ్‌దేవ్ సింగ్, భారతి కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగరాహన్) ప్రధాన కార్యదర్శి
ఎర్రకోట వైపు వెళ్లాలన్న ఆలోచనే లేదు
"ఎర్రకోట వైపు వెళ్లాలన్నది రైతుల ఆందోళన ప్రణాళికలో లేనేలేదు. దీప్ చేసింది తీవ్రంగా ఖండించదగినది. అతనెప్పుడూ రైతు నేతలకు వ్యతిరేకంగానే మాట్లాడేవాడు. వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేవాడు."
- గుర్నామ్ సింగ్ చదూనీ, భారతీయ కిసాన్ యూనియన్ (చదూనీ)
దర్శన్‌పాల్‌కు దిల్లీ పోలీసుల నోటీసు
రైతుల ఉద్యమంలో పాల్గొన్న నేత దర్శన్‌పాల్‌కు దిల్లీ పోలీసులు బుధవారం రాత్రి నోటీసు జారీ చేశారు. ఎర్రకోటపై విధ్వంసానికి పాల్పడడం దేశ వ్యతిరేక చర్య అని, దానిపై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని దానిలో పేర్కొన్నారు. మంగళవారం నాటి ట్రాక్టర్ల ర్యాలీలో పాల్, ఇతర రైతు నేతలు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని నోటీసులో ఆరోపించారు.
ఇదీ చదవండి: దిల్లీ హింస: 550 ట్విట్టర్ ఖాతాలపై వేటు