బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)(Indian Meteorological Department) తెలిపింది. దీనికి 'గులాబ్'(Gulab Cyclone Update) అని పేరు పెట్టినట్లు చెప్పింది. తుపాను(Gulab Cyclone Update) నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు 'ఆరెంజ్' హెచ్చరికలను జారీ చేసింది.
తుపాను పశ్చిమ దిశగా కదిలి.. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం- ఒడిశాలోని గోపాల్‌పుర్ మధ్య తీరం దాటనుందని ఐఎండీ ప్రకటించింది. తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
సమీక్షా సమావేశం...
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వాల సంసిద్ధతపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన శనివారం జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. తుపాను ముందు నష్ట నివారణ చర్యలు, తుపాను తరువాత ప్రభుత్వాలు కల్పించే సదుపాయాలు, ప్రజలను కాపాడటానికి చేపట్టిన సన్నాహక చర్యలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వివరించారు. ఏపీ, ఒడిశాలో తుపాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
సహాయక చర్యల కోసం సిద్ధం..
సహాయక చర్యల కోసం సైన్యం, నౌకా దళ రెస్క్యూ, రిలీఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ పేర్కొంది. అత్యవసర సహాయం కోసం నౌకలు, విమానాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. తుపాను ప్రభావం తీవ్ర రూపం దాల్చక ముందే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ