కోల్కతాలో తొమ్మిది ప్రాణాలను బలిగొన్న తూర్పు రైల్వే కొయిలాఘాట్ భవన అగ్నిప్రమాదంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్, భాజపా ఈ ఘటనపై పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. విపత్తు నిర్వహణ చర్యల్లో తృణమూల్ ప్రభుత్వం విఫలమైందని భాజపా ఆరోపించింది. ఇవి అర్థం లేని ఆరోపణలని సర్కారు తోసిపుచ్చింది. సహాయక చర్యల్లో పారదర్శకత, సమర్థత లేవని.. స్థానిక సంస్థల సేవలను వినియోగించుకుంటే బాగుండేదని బంగాల్ భాజపా కో ఇన్ఛార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని దృష్టిలో పెట్టుకుని 'పిషి'(బంగాలీలో మేనత్త అని అర్థం) అంటూ వ్యంగ్యంగా ఆయన సంభోదించారు.
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖ మంత్రి సుజిత్ బోస్ స్పందిస్తూ.. భాజపా ఈ దుర్ఘటనను రాజకీయం చేయాలని చూస్తోందని, రైల్వేశాఖ సహకారం లేకున్నా తమవైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నట్లు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.
ప్రధాని సాయం..
అగ్నిమాపక దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ ద్వారా అభిలషించారు.
ఇదీ చూడండి: అందరికీ టీకాలు అందేలా..