Dead body alive Delhi: దిల్లీ సమీపంలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. కొద్ది క్షణాల్లో అంత్యక్రియలు జరుగుతాయనగా.. చితిపై ఉంచిన మృతదేహం కళ్లు తెరిచింది. వృద్ధుడు మరణించినట్లు వైద్యులు తప్పుగా ధ్రువీకరించడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
Dead man in India comes alive
సతీష్ భరద్వాజ్(62) అనే వ్యక్తి క్యాన్సర్‌తో బాధపడుతూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. సోమవారం వేకువజామున బాధితుడు తుదిశ్వాస విడిచాడని ఆస్పత్రి వర్గాలు.. కుటుంబ సభ్యులకు తెలిపాయి. ఏకంగా 11 మంది డాక్టర్లు బాధితుడి మృతిని నిర్ధరించారు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లారు. చితికి నిప్పంటించే ముందు వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. అంతే.. శవం కదిలినట్లు కనిపించింది. వృద్ధుడు నెమ్మదిగా కళ్లు తెరిచాడు. అనంతరం మాట్లాడాడు కూడా.
ఈ పరిణామంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. దిల్లీ పోలీసులకూ సమాచారం అందించారు. వృద్ధుడిని నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆస్పత్రిలో చేర్చారు. వృద్ధుడి బీపీ, పల్స్ రేట్, హార్ట్‌బీట్ నార్మల్‌గానే ఉన్నాయని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందా అని ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: విద్యార్థి ఆత్మహత్య.. శవాన్ని తీసుకెళ్లలేమన్న తల్లిదండ్రులు- ఎందుకంటే?