అతి తీవ్ర స్థాయికి బలపడిన తౌక్టే తుపాను సోమవారం సాయంత్రానికల్లా గుజరాత్ తీరాన్ని చేరుకుంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పోర్బందర్, మహువా(భావ్నగర్ జిల్లా) వద్ద మంగళవారం ఉదయం తీరం దాటుతుందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో తుపాను మరింత తీవ్రంగా మారుతుందని పేర్కొంది.
గోవాలోని పంజింకు దక్షిణ నైరుతి దిక్కున 130 కిమీ, ముంబయి దక్షిణాన 450 కిమీ, వెరావల్(గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయాన 700 కిమీ, కరాచీ(పాకిస్థాన్)కి ఆగ్నేయాన 840 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
యడ్డీ సమీక్ష
తుపాను కర్ణాటక తీరం తాకిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప పరిస్థితులను సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని ఇంఛార్జి మంత్రులను ఆదేశించారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారని స్పష్టం చేశారు. అత్యవసరమైతే మంత్రులకు నేరుగా ఫోన్ చేయాలని అధికారులకు సూచించారు.
షా సమావేశం
మరోవైపు, తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. డామన్ డయ్యూ దాద్రా నగర్ హవేలీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.