తమిళనాడులో మాండౌస్ తుఫాన్ తీరానికి చేరువైంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న కొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచింది. చెన్నైలో మాండౌస్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉందన్నారు సబ్-ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే తమ బృందం వెంటనే అవసరమైన చోటుకు వెళుతుందని ఆయన తెలిపారు.
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు, 16,000 మంది పోలీసు సిబ్బందిని, మరో 1,500 మంది హోంగార్డులను సంసిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే దాదాపు 400 మంది కావేరి డెల్టాతో పాటు మరికొన్ని తీర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం మోహరించినట్లు వెల్లడించింది.
తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయంలో ఉదయం నుంచి దాదాపు పది విమానాలు రద్దయ్యాయి. మరో 13 విమానాలను దారి మళ్లించారు. పలు రైళ్లను, బస్ సర్వీసులు సైతం పాక్షికంగానే నడిచాయి. తీరప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించింది.
కాగా మాండౌస్, "మాన్-డాస్" అనే అరబిక్ పదం నుంచి ఉద్భవించింది. దీనికి నిధి పెట్టె అని అర్థం వస్తుంది.
ఇవీ చదవండి:
అవినీతి చిక్కుల్లో 'ఖాకీ IPS ఆఫీసర్'.. రూ.1కే అగ్రిమెంట్.. భార్య అకౌంట్లోకి రూ.49 లక్షలు!
రాజ్యసభ ముందుకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు.. విపక్షాల నిరసనల మధ్యే..