తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాను తీరందాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది దాదాపు మూడు గంటల పాటు కొనసాగవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం-ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని తాకుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో గంటకు 75-85 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తుపాను ప్రభావంతో గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి.
తుపాను తీరందాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజల్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపింది. గజపతి జిల్లాలోని కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1,600 మందిని రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రదేశాలకు తరలించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఒడిశా తీరం వెంబడి ఉన్న 11 జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
సీఎంకు మోదీ ఫోన్..
గులాబ్ తుపాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: