దిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం వద్ద మోహరించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) జవాన్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడిని 53 ఏళ్ల అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) రాజ్బీర్ కుమార్‌గా గుర్తించారు. ఏకే-47తో జవాను కాల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు వారి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. 'జిల్లా ఫోరెన్సిక్ బృందం వచ్చి వేలిముద్రలు సేకరించింది. గన్ శబ్దం వినిపించగానే ఐబీ డైరెక్టర్ ఇంటి వద్ద ఉన్న ఇతర సిబ్బంది వెంటనే వెళ్లి తనిఖీ చేశారు. రక్తపు మడుగులో ఉన్న జవానును గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం' అని సీనియర్ అధికారులు తెలిపారు. అయితే అతని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి పోస్టుమార్టం శనివారంతో ముగుస్తుంది. అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పిగిస్తామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
కేంద్ర సాయుధ బలగాల్లో ఆత్మహత్యలు భారీగా నమోదవుతున్నాయి. 2017 నుంచి 2021 మధ్య 642 మంది కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా 227 మంది సీఆర్పీఎఫ్ నుంచే ఉన్నారు.