BSF Detects Tunnel: జమ్ముకశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు దీనిగుండా భారత్లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు. ఇటీవలే తవ్విన ఈ సొరంగం.. పాక్ వైపు నుంచి దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏప్రిల్ 22న సుంజ్వాన్ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు ఇప్పుడు సొరంగాన్ని గుర్తించారు.
అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం బయటపడడం.. గత 16 నెలల్లో ఇదే తొలిసారి అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత దశాబ్దకాలంలో ఇది 11వ సారి అని తెలిపారు. పాకిస్థాన్ పోస్ట్ ఛమన్ ఖుర్ద్ నుంచి సొరంగం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పేర్కొన్నారు.
కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర చేపడుతారు. అయితే, ఈ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.
ఇవీ చూడండి: 'ఆజాద్' సేన కోసం అంతా ఏకమై.. నల్లకోటుతో కోర్టుకు నెహ్రూ!
రూ.15 కోట్ల హెరాయిన్ సీజ్.. ఆఫ్రికా మహిళ శరీరంలో 70 డ్రగ్ క్యాప్సుల్స్