ఒకప్పుడు బంగాల్ అంటే కమ్యూనిస్టుల రాజ్యం. 1977 నుంచి దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని ఏకధాటిగా పాలించి చరిత్ర సృష్టించిన కామ్రేడ్ల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలుచుకోలేని పరిస్థితి. 2011 నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కనీసం పోటీ ఇవ్వలేని దుస్థితి.
అయితే ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐకమత్యంతో ముందుకెళ్లి పోటీ చేసిన వాపమక్షాలు ఎవరూ ఊహించని విధంగా 16 స్థానాల్లో గెలిచాయి. ఈ ఫలితం కామ్రేడ్లలో నూతనోత్తేజం నింపింది. వచ్చే ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని వామపక్షాలు భావించాయి. కానీ సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం ఇప్పుడు కామ్రేడ్ల ఆశలపై నీళ్లు జల్లేలా చేస్తోంది. తమకు ప్రధాన శత్రువు భాజపానా లేక తృణమూలా అనే విషయంపై రెండు వామపక్ష పార్టీల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడమే ఇందుకు కారణం.
'మోదీ భాయ్- దీదీ భాయ్ ' చిచ్చు..
బంగాల్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ తమకు ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా అని సీపీఐ(ఎంఎల్) చెబుతోంది. అయితే సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాత్రం ఇందుకు భిన్నంగా వాదిస్తున్నారు. బంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్‌ను ఓడించకుండా భాజపాను దీటుగా ఎదుర్కోవడం అసాధ్యమని ఆయన అంటున్నారు. ఈ విషయంపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. కొద్ది రోజల క్రితం వారకు నామమత్రంగా ఉన్న ఈ విభేదాలు.. ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునే స్థాయికి చేరాయి.
సీతారాం వ్యాఖ్యలపై సీపీఐ(ఎంఎల్) పొలిట్ బ్యూరో సభ్యులు కవితా కృష్ణన్ స్పందించారు. భాజపా, తృణమూల్‌ను ఒకే విధంగా చూడటాన్ని తప్పుబట్టారు. ఈ రెండు పార్టీలను సమాంతరంగా చూపేందుకు సీతారాం పయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవ పరిస్థితులకు ఇది పూర్తి విరుద్ధమన్నారు.
"మమత, మోదీ మధ్య వ్యత్యాసం లేదని చూపేందుకు సీపీఐ(ఎం) తప్పుడు ప్రయత్నం చేస్తోంది. వారి 'మోదీ భాయ్- దీదీ భాయ్' ప్రచారానికి వాస్తవిక ఆధారం లేదు. భాజపాకు కౌంటర్ ఇచ్చే స్థితిలో తృణమూల్ ఉంది. బిహార్‌లో భాజపా-జేడీయూలా బంగాల్‌లోనూ భాజపా-తృణమూల్ ఒకటే అనే విధంగా సీపీఐ(ఎం) ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. కానీ అది కాల్పనికత తప్ప వాస్తవం కానే కాదు. తృణమూల్‌ను వ్యతిరేకించడం అంటే భాజపాకు కూడా కౌంటర్ ఇవ్వడమే అనే భావనలో సీపీఐ(ఎం) ఉంది. మతతత్వ పోటీ అంశంపై భాజపా, తృణమూల్ గురించి సీపీఐ(ఎం) చేస్తున్న ప్రచారం సరికాదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగిస్తోందని, భాజపా హిందుత్వ వాదంపై ప్రచారం చేస్తోందని సీపీఐ(ఎం) చెబుతోంది. ఈ ప్రచారం వల్ల భాజపాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది."
-కవితా కృష్ణన్, సీపీఐ(ఎంఎల్) నేత
మోదీ, మమత ఒకటే అని చెప్పేందుకు 2015లోనే వామపక్షాలు 'మోదీ భాయ్- దీదీ భాయ్' నినాదాన్ని సృష్టించాయి.
సీపీఐ(ఎం) స్పందన..
కవిత వ్యాఖ్యలపై లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీమన్ బోస్ దీటుగా స్పందించారు. బంగాల్లో భాజపా, తృణమూల్.. రెండు పార్టీలు ప్రజలకు ప్రమాదకరమైన శత్రువులేనని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చని కవితను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. లెఫ్ట్ ఫ్రంట్‌కు అలాంటి వ్యాఖ్యలు అర్థరహితమైనవని చెప్పారు. ఆ మాటలకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వరని స్పష్టం చేశారు.
తృణమూల్ ఖుషీ..
సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మధ్య విభేదాలు తమకు కలిసొచ్చే అంశమే అయినా.. ఈ పరిణామాలను తృణమూల్ నాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. కొద్ది రోజుల క్రితమే బిహార్‌లో పోటీ చేసినప్పుడు ఈ రెండు పార్టీలు మిత్రులుగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ తృణమూల్ నేత గుర్తుచేశారు.
"తృణమూల్ పట్ల సీపీఐ(ఎంఎల్) సున్నితంగా వ్యవహరించడానికి ఏదో రాజకీయ కారణమే ఉండి ఉంటుంది. మాతో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు గెలవచ్చని వారు భావిస్తున్నారేమో. ఏ కూటమిలోనైనా పార్టీలు స్వప్రయోజనాల గురించే ఆలోచిస్తాయి. సీపీఐ(ఎంఎల్) భాగస్వామ్యంతో కూటమిని ఏర్పాటు చేస్తే మాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనే విషయం గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. "
-ఓ తృణమూల్ నేత.
అయితే ఈ విషయంపై తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్‌ను సంప్రదించగా.. పొత్తు వ్యూహాలకు సంబంధించి అంతిమ నిర్ణయం పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రమే తీసుకుంటారని స్పష్టం చేశారు. వామపక్షాల మధ్య తలెత్తిన విభేదాలు ఆ పార్టీల అంతర్గత వ్యవహారమని చెప్పారు. దానిపై తాను స్పందించడం సరికాదన్నారు రాయ్.