సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు వర్చువల్గా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్తో పాటు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు.
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ సమావేశం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ఇతర వర్గాలు కూడా తమ విలువైన సలహాలు, సూచనలు పంపాలని పోఖ్రియాల్ కోరారు.
కొవిడ్ విజృంభణ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేసిన సీబీఎస్‌ఈ.. 12వ తరగతి పరీక్షల్ని మాత్రం వాయిదా వేసింది. వాటి నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలతో చర్చించేందుకు సిద్ధమైంది. అలాగే జాతీయ విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల నిర్వహణ, వాటి తేదీలపైనా రేపు జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'కరోనా మృతుల పట్ల మోదీ మొసలి కన్నీరు'