Jaipur Child Labour News: రాజస్థాన్ జైపుర్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలు ఓ 12 ఏళ్ల బాలుడితో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడమే గాక.. అతడ్ని తీవ్రంగా హింసించారు. అంతేకాదు భర్త ఆ బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, బాధితుడే ఈ విషయం చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబధించి కేసు నమోదు చేసి భార్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం వెతుకుతున్నారు.
"12 ఏళ్ల బాలుడిని దంపతులు తీవ్రంగా హింసించారు. ఇంట్లో భార్య లేని సమయంలో ఆమె భర్త తనను రేప్ చేశాడని బాలుడు చెప్పాడు. చివరకు అతడు ఎలాగోలా ఇంట్లో నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ప్రస్తుతం ఎన్జీఓ ఆశ్రమంలో ఉంటున్నాడు. బాల కార్మిక చట్టం, పోక్సో చట్టం కింద భార్య, భర్తపై కేసు నమోదు చేశాం." అని పోలీసులు వెల్లడించారు. నిందితుడు బాలుడ్ని చిత్రహింసలకు గురిచేశాడని, అతడు ఇంట్లో నుంచి పారిపోకుండా కాలుపై వేడి కత్తితో పెద్ద వాత పెట్టాడని వివరించారు.
Couple Assault Child: పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ బాలుడు బిహార్‌కు చెందినవాడు. నిందితులు ఏడు నెలల క్రితం అతడ్ని గాజులు తయారు చేసే పని ఇస్తామని చెప్పి జైపుర్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇంట్లోనే బంధించి వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. చెప్పిన పని చేయకపోతే తీవ్రంగా హింసిస్తున్నారు. అయితే ఒక రోజు బాలుడు ఇంటిపైకెక్కి పక్కింటిపై దూకాడు. అప్పటికే కాలికి వాతలు ఉండటం వల్ల అతడు సరిగ్గా నడవలేకపోయాడు. తనను ఏలాగైనా కాపాడాలని పొరుగింటి వారిని ప్రాధేయపడ్డాడు. వెంటనే వాళ్లు స్పందించి బాలల సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అప్పుడు అధికారులు వెళ్లి బాలుడ్ని కాపాడారు. మార్చి 21న ఈ ఘటన జరిగింది.
బాలుడ్ని కాపాడటానికి వెళ్లినప్పుడు తీవ్ర గాయాలతో ఉన్నాడని, కనీసం లేచి నిలబడే స్థితిలో కూడా లేడని అధికారి సుమన్ తెలిపారు. నిందితులను మహమ్మద్ రియాజ్, రూహి ప్రవీణ్‌గా గుర్తించినట్లు చెప్పారు. బాలుడు రోజూ ఉదయం 4 గంటల నుంచి మరునాడు ఉదయం ఒంటి గంట వరకు దంపతుల ఇంట్లోనే గాజులు తయారు చేసేవాడని, నెలల పాటు వెలుతురు కూడా చూడలేదని అధికారులు వెల్లడించారు. అతడి గొంతుపై కూడా గాట్లు ఉన్నాయన్నారు. మొదటగా అతనికి ప్రాథమిక చికిత్స అందించి, ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని వివరించారు. ప్రస్తుతం ఓ ఎన్జీఓ అతనికి ఆశ్రయం కల్పిస్తోందన్నారు.
ఇదీ చదవండి: లక్ అంటే ఈ పిల్లవాడిదే.. బస్సు చక్రాల కింద పడినా..