అడవులను దహించి వేసే కార్చిచ్చులా కరోనా వైరస్ జనారణ్యాల్లో విజృంభిస్తోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలను ముమ్మరం చేశాయి. ఆసుపత్రుల్లో పడకల లభ్యత, ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. దిల్లీ ప్రభుత్వం ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించగా.. రాజస్థాన్ సర్కారు పక్షం రోజులు ప్రజలే స్వీయ ఆంక్షలతో కొవిడ్‌పై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చింది. కేరళ కూడా రాత్రిపూట కర్ఫ్యూను మంగళవారం నుంచి అమలు చేయనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయిదు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
445 రోజులు.. కోటిన్నర కేసులు..
దేశంలో మొత్తం కరోనా కేసులు కోటిన్నర దాటాయి. ఈ మహమ్మారి ప్రస్థానం 445 రోజుల్లో.. రోజుకు సగటున 33,847 చొప్పున మొత్తం 1,50,61,919 కేసులకు చేరింది. కేసుల సంఖ్య తొలి 25 లక్షలకు చేరుకోవడానికి 198 రోజులు పట్టగా చివరి 25 లక్షలు 15 రోజుల్లోనే వచ్చాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రకారం సోమవారం ఉదయం 8గంటలతో ముగిసిన గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 మందికి వైరస్ సోకింది. 1619 మంది మృత్యువాత పడ్డారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(88)కు కొవిడ్ వైరస్ సోకిందని నిర్ధరణ అయ్యింది. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఎయిమ్స్‌లో చేరారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఆకాంక్షించారు. బిహార్‌లో కరోనాతో జేడీయూ ఎమ్మెల్యే మేవలాల్ చౌధరి మరణించారు.
దిల్లీ విలవిల..
దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. ఒక్కరోజులోనే అక్కడ 25వేల మందికి పైగా మహమ్మారి సంక్రమించింది. వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించక తప్పడంలేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ విధిస్తున్నామని తెలిపారు. ఎవరూ దిల్లీ వదిలిపోవాల్సిన అవసరం లేదన్నారు. లాక్‌డౌన్ ప్రకటనతో దిల్లీ వాసులు నిత్యావసరాల సరకుల కోసం అంగళ్లకు పరుగులు తీశారు. మందుబాబులు వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు బయలుదేరారు. ఎయిమ్స్‌లో ఈ నెల 22 నుంచి బయటి రోగులకు (ఓపీ) సేవలను నిలిపివేయనున్నారు. దిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వెంటిలేటర్ల అందుబాటుపై సవివర నివేదికతో అఫిడవిట్‌ను మంగళవారం సమర్పించాలని కేంద్రంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
రాజస్థాన్‌లో స్వీయ ఆంక్షలు..
లాక్‌డౌన్‌లో విధించే ఆంక్షలను పక్షం రోజుల పాటు ప్రజలే క్రమశిక్షణతో స్వయంగా పాటించాలని రాజస్థాన్ విజ్ఞప్తి చేసింది. సోమవారం నుంచి మే 3వ తేదీ ఉదయం 5గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతి అత్యంత ప్రమాదకరంగా ఉందని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు.
పంజాబ్‌లో..
రాత్రి కర్ఫ్యూను మరో గంట పాటు పొడిగించడంతో పాటు బార్లు, మాల్స్, సినిమా థియేటర్లు, కోచింగ్ సెంటర్లు, వ్యాయామ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలను ఈ నెల 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
యూపీలో అయిదు నగరాల్లో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్(అలహాబాద్), వారణాసి, కాన్పుర్, గోరఖ్‌పుర్‌లలో ఈ నెల 26 వరకు లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా దీన్ని అమలు చేయడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధంగా లేదు.
మధ్యప్రదేశ్‌లో..
రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఔషధాన్ని, కొవిడ్‌పై పోరుకు అవసరమైన ఇతర వనరులను సమకూర్చుతామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం శివరాజ్ సింగ్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులందరికీ వచ్చే మూడు నెలల పాటు రేషన్ సరకులను ఉచితంగా అందించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు.
బెంగాల్‌లో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
పశ్చిమ బెంగాల్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించటానికి సీఎం మమత సుముఖత వ్యక్తం చేయలేదు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, ఔషధాల సరఫరా, ఆక్సిజన్ అందుబాటులో ఉంచడం, టీకాల సక్రమ నిర్వహణకు అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం తమ రాష్ట్రానికి మరిన్ని టీకాలను, ఆక్సిజన్ సిలిండర్లను పంపించాలని మమత కోరారు. మంగళవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.
మహారాష్ట్రలో రూ.5476 కోట్ల ప్యాకేజీ
కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో అమలు చేస్తున్న వివిధ ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యే పేదలు, ఇతర బలహీన వర్గాల వారికి యుద్ధ ప్రాతిపదికన రూ.5476 కోట్ల ప్యాకేజీ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. నాగ్‌పుర్‌లో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నితిన్ రౌత్ ప్రకటించారు.
ఇదీ చూడండి: 'వాటిని 2 నెలలు నిషేధిస్తేనే కరోనాకు అడ్డుకట్ట!'