Constable Blood Donation Service : బంగాల్లోని కోల్‌కతాలో ఓ కానిస్టేబుల్ రక్తం అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారు. రక్తదానం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఏడువేల మంది రక్తదాతల వివరాలను సేకరించారు. తన వద్ద ఉన్న రెండు స్మార్ట్ ఫోన్లలో వాటిని పొందుపర్చారు. రక్తం అవసరమైన వారికి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు.
"నా పోలీస్ శిక్షణా కాలంలో 'బ్లడ్ డొనేషన్ క్యాంప్' నిర్వహించేవారు. ఆ సమయంలో నేను తొలిసారి 19ఏళ్ల వయసులో రక్తదానం చేశాను. ఎందుకు రక్తదానం చేయాలి, రక్తదానం వల్ల లాభాలేంటి, ఏడాదిలో ఎన్నిసార్లు రక్తదానం చేయవచ్చు, రక్తదానం చేయడానికి ఎంత బరువుండాలి, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇప్పటి వరకు నేను 192 సార్లు రక్తదానం చేశాను"
- బాపన్ దాస్, కానిస్టేబుల్, కోల్‌కతా స్పెషల్ బ్రాంచ్
"కొంతకాలం క్రితం మా అమ్మ అనారోగ్యంతో బాధపడింది. ఆమెకు కిడ్నీ సమస్య ఉందని వెంటనే రక్తం అవసరమని మాకు తెలిసింది. ఆ సమయంలో కోల్‌కతాలో ఉంటున్న నా స్నేహితుడు అయిన బాపన్ గుర్తుకు వచ్చారు. వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ఆయన పదినిమిషాల్లోనే బ్లడ్ అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మేం ఆస్పత్రికి వెళ్లి బ్లడ్ ప్యాకెట్‌ను తీసుకున్నాం"
- సవాన్ రహా, బాపన్ స్నేహితురాలు
23 ఏళ్లుగా
బాపన్ దాస్ గత 23 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది బాపన్ బాటలో నడుస్తున్నారు.
"బాపన్ దాస్ నా సోదరుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నా. ఆయన విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని చూసిన తరువాత నేను కూడా రక్తదానం చేయాలనుకున్నా. ప్రస్తుత కాలంలో వివిధ జబ్బుల చికిత్సలకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం అత్యవసరమవుతుంది. అందువల్లే 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా రక్తదానం చేయల్సిన అవసరం ఎంతైనా ఉంది".
-విక్కీ సర్కార్, రక్తదాత
'బాపన్ పలు కార్యక్రమాల్లో రక్తదానంపై చైతన్యం తెచ్చేందుకు సందేశాలు ఇచ్చేవారని నాకు గుర్తుంది. రక్తదానం చేస్తే మీకే కాదు ఇతరులకు కూడా మేలు జరుగుతుంది' అని జాకీర్ ఆలమ్ అనే రక్తదాత చెప్పారు. బాపన్ దాస్ నిర్వహించే రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పేదవారికి, రక్తం అవసరమైన వారికి సులభంగా రక్తం అందుతుంది.