Congress Survey In Parliament Constituencies : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందుకోసమే ఇండియా కూటమిలో సీట్ల పంపకానికి ముందే దేశవ్యాప్తంగా 500 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టాలని భావిస్తోంది. దీనికోసం ఏఐసీసీ ఓ పరిశీలకుల కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ పరిశీలకులు క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సర్వే చేసి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది.
అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించే క్లస్టర్ ఇంఛార్జ్‌లను నియమించిన తర్వాత ఈ పరిశీలకుల నియామకం జరుగుతందని సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో పరిశీలకులు, క్లస్టర్ ఇంఛార్జ్‌ల సహాయాన్ని తీసుకోవచ్చు. అయితే సీట్ల పంపకంపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల 'ఇండియా కూటమి ప్యానెల్' సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సర్వే ప్రతిపాదన తీసుకొచ్చింది. ఎన్నికలకు సన్నద్ధం కావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
"ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ప్రస్తుతం ఇండియా కూటమి సీట్ల పంపకం చర్చలు సరైన దిశలో సాగుతున్నాయి. ఈ నెలలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, బిహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీకి 37 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షాల ఓటు శాతం 63. కానీ అప్పుడు విపక్షాలు ఐక్యంగా లేవు. ఈసారి జేడీయూ, శివసేన వంటి కీలక మిత్రపక్షాలు బీజేపీకి దూరమయ్యాయి. విపక్షాల ఓట్లు ఏకమైతే 2024 ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి"
--ఆశిశ్ దువా, ఏఐసీసీ మహారాష్ట్ర ఇంఛార్జ్ కార్యదర్శి
'దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లోని పరిస్థితి గురించి మేము తెలుసుకోవాలి. ఒకవేళ సీట్ల పంపకంలో భాగంగా మేము పోటీ చేయని సీటు మాకు వచ్చినా గెలిచేలా సన్నద్ధం కావాలి. అవసరమైతే మా మిత్ర పక్షాలకు సహాయం చేసే స్థితిలో మేము ఉండాలి' అని సీడబ్ల్యూసీ సభ్యుడొకరు అన్నారు.
మహారాష్ట్రలోని మొత్తం 48 స్థానాల్లో తమ పార్టీ 23 సీట్లలో పోటీచేయాలనుకుంటున్నట్లు అనధికారికంగా మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీలకు కాంగ్రెస్ చెప్పిందని తెలుస్తోంది. బంగాల్లో 12 (42), బిహార్‌లో 12 (40) స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ గుర్తించినట్లు సమాచారం. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో 15 (80) స్థానాలను అడిగే ఛాన్స్ ఉందట. 2019లో 421 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 50 సీట్లను మాత్రమే గెలుచుకుంది.
నెలాఖరులోగా అన్ని కొలిక్కి వస్తాయి : ఖర్గే
ఇండియా కూటమిలో ఏయే పదవులను ఎవరు నిర్వర్తించాలనేది 10-15 రోజుల్లో నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు. కూటమి పక్షాలతో సీట్ల సర్దుబాటు కోసం సమన్వయకర్తలను నియమించామని, అన్ని విషయాలూ ఈ నెలాఖరులోగా కొలిక్కి వస్తాయని చెప్పారు. వారు ప్రతి నియోజకవర్గంలో మిత్రపక్షాలతో చర్చలు జరిపి తొలుత రాష్ట్రస్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో అవగాహనకు మార్గం సుగమం చేస్తారని చెప్పారు.
గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వకపోతే!
బిహార్‌లో మహా కూటమిలో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయించకపోతే తమ పార్టీతోపాటు జేడీయూ సహా అన్ని భాగస్వామ్య పక్షాలపైనా ప్రభావం పడుతుందని కాంగ్రెస్ పేర్కొంది. 40 లోక్‌సభ స్థానాలకు గానూ నాలుగు కంటే తక్కువతో సరిపెట్టుకోవాలని కూటమి చెబుతున్నట్లు వెలువడిన వార్తలపై బిహార్ పీసీసీ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్‌సింగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.