Justice Subhash Reddy retirement: ప్రజల స్వేచ్ఛకు గౌరవమిచ్చి, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించిన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. నిరాడంబరత, నమ్రతతో అందరి మనసులూ గెలుచుకున్నారని, ఆయన జీవితం యువ న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ సుభాష్‌రెడ్డి గౌరవార్థం సుప్రీం బార్ అసోసియేషన్ మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి అని తెలిపారు.
‘‘ఆయనతో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తికి పదవీవిరమణ వీడ్కోలు పలకడం బాధాకర అంశం. తీరికలేని పనితో ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు పరుగులుపెట్టే యువ న్యాయవాదిగా ఆయన నాకు బాగా గుర్తు. 20 ఏళ్లపాటు వివిధ హైకోర్టులతో పాటు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రజల స్వేచ్ఛను సమర్థించడంతోపాటు, వారి ప్రాథమిక హక్కులను రక్షించడానికి జస్టిస్ సుభాష్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో సున్నితమైన కేసులను విచారించి దాదాపు 100కిపైగా తీర్పులు రాశారు. నేనూ ఆయనతో ధర్మాసనాన్ని పంచుకొన్నా. ఆయన అభిప్రాయాలు, నిశితదృష్టి ద్వారా ఎంతో ప్రయోజనం పొందా. సామాజిక వాస్తవాలను అర్థంచేసుకొని, ఎంతో సంవేదన శీలతతో వ్యవహరించారు. ఆయనున్న న్యాయస్థానాన్ని నిజమైన సమస్యలతో ఆశ్రయించినవారు ఎన్నడూ నిరాశతో తిరిగివెళ్లలేదు’’ అని జస్టిస్ ఎన్.వి రమణ తెలిపారు.
విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలి: జస్టిస్ సుభాష్‌రెడ్డి
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు జస్టిస్ సుభాష్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా ప్రస్తుత న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనావళి.. కోర్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేలా లేవు. 19వ శతాబ్దంలో రూపొందించిన సివిల్, క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియ విధానం ఎంతో సమయం తీసుకుంటోంది. పారిశ్రామిక విప్లవానికి ముందు రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటి ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్టుగా సవరించాల్సిన అవసరం ఉంది. సాధారణ సివిల్, క్రిమినల్ కేసుల విచారణకు హైకోర్టులపైన అప్పిలేట్ కోర్టు వ్యవస్థ ఏర్పాటుచేస్తే బాగుంటుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ విధానం కొంతవరకు సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది. అదే సమయంలో జిల్లా కోర్టుల్లో పెద్దఎత్తున పేరుకుపోయిన కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్ సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్‌సింగ్, సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
వార్షిక నివేదిక తొలి కాపీ జస్టిస్ సుభాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు వార్షిక (2020-21) నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ మంగళవారం న్యాయమూర్తుల సమక్షంలో ఆవిష్కరించారు. తొలి కాపీని జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి అందజేశారు
బాధాకరం..
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో పాటు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ సుభాష్ పదవీ విరమణ చేయడం బాధాకరమని అటార్నీ జనరల్ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయనకు విశేష అనుభవం ఉందని అన్నారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు ఆయనకు బార్ అసోసియేషన్‌లో అత్యంత ఆదరణ ఉండేదని గుర్తు చేశారు.
మెదక్ వాసి...
తెలంగాణకు చెందిన జస్టిస్ సుభాష్ రెడ్డి.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలోని కమరం గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1957లో జన్మించారు. 1980 అక్టోబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదిగా రిజిస్టర్ అయ్యారు. ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులుకాక ముందు.. ఎస్వీ యూనివర్సిటీ, జేఎన్టీయూ వంటి ప్రఖ్యాత సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు. 2016 ఫిబ్రవరి 13న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2018 నవంబర్ 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి వ్యక్తి ఈయనే. జస్టిస్ సుభాష్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు తగ్గింది.
ఇదీ చదవండి: 'గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే.. అభివృద్ధికి ఆటంకం'