cji nv ramana berlin tour: జర్మనీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆదివారం సతీమణి శివమాలతో కలిసి బెర్లిన్ గోడ స్మారకాన్ని సందర్శించారు. రెండో ప్రపంచయుద్ధం, తూర్పు-పశ్చిమాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత జర్మనీ విభజనకు ఈ బెర్లిన్ గోడ అంతర్జాతీయ చిహ్నంగా మిగిలింది. దీని నిర్మాణం 1961 ఆగస్టు 13న ప్రారంభమైంది. 1949 నుంచి 1961 మధ్యలో 25 లక్షల మంది తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మనీకి పారిపోయారు. ఆ సంఖ్య క్రమంగా పెరగడం వల్ల నైపుణ్యం ఉన్న కార్మికులు, వృత్తి నిపుణులు, మేధావులు వలసపోయి తూర్పు జర్మనీ ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితులు కనిపించడంతో అక్కడి పాలకులు తూర్పు జర్మనీకి మిగతా జర్మన్ భూభాగంతో రాకపోకలు లేకుండా చేయడానికి బెర్లిన్ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాందిశీకుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి, తనిఖీలు లేకుండా సరిహద్దులు దాటడానికి వీల్లేకుండా చేయడానికి ఈ గోడను నిర్మించారు.
ఈ గోడలో పలు విభాగాలు ఉన్నాయి. ముందు, వెనక గోడలు, మధ్యలో గస్తీ దారి, నిఘా స్తంభాలు, బ్యారియర్లు ఏర్పాటుచేశారు. 1989 నాటికి 136 మంది ప్రజలు ఈ గోడ వద్ద ప్రాణాలు కోల్పోయారు. అందులో 98 మంది పారిపోవడానికి ప్రయత్నిస్తూ కన్నుమూశారు. వీరందరినీ జర్మనీ డెమోక్రటిక్ రిపబ్లిక్ సాయుధులే కాల్చి చంపారు. సోవియట్ యూనియన్లో సంస్కరణలు, తూర్పు జర్మనీ ప్రజల్లో నిరసన ఉద్యమాలు పెరగడం వల్ల 1989 అక్టోబరులో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీతో సరిహద్దులను తెరవడం వల్ల బెర్లిన్ గోడ పతనానికి పునాది పడింది. 1990 అక్టోబరు 3న జర్మనీ పునరేకీకరణకు ముందే బెర్లిన్ భూభాగం నుంచి ఈ గోడలో చాలా భాగం మటుమాయమైంది.
అయితే జర్మనీలో ఉన్న అవుట్ డోర్, ఇండోర్ మ్యూజియం 'టోపోగ్రఫీ ఆఫ్ టెర్రర్' విజ్ఞప్తి మేరకు గత గుర్తుల కోసం తూర్పు, పశ్చిమ బెర్లిన్ల మధ్య మిగిలిన 200 మీటర్ల గోడను అలాగే భద్రంగా ఉంచారు. దీనినే 1990లో చారిత్రక స్మారక చిహ్నంగా ప్రకటించారు. జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు ఆ స్మారక చిహ్నాన్ని ఆదివారం సందర్శించారు.
ఇదీ చదవండి: అగ్నిపథ్ ఆగేదే లేదు.. నియామక షెడ్యూళ్లు ప్రకటించిన త్రివిధ దళాలు